బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి రాజకీయ సూచన చేశారు. పొంగులేటి ఏ పార్టీలో చేరినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అక్కడ కూడా ఆయా పార్టీ నాయకులను ఓడిస్తారని చెప్పారు. అందువల్ల పొంగులేటి సొంతంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం లభిస్తుందని వెటకరించారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై గాయత్రి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతహాగా సౌమ్యుడైన గాయత్రి రవి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి గాయత్రి రవి చేసిన ప్రసంగంలోని ముఖ్య సారాంశం ఆయన మాటల్లోనే…

‘‘మీకు చాలా అవకాశాలు ఇచ్చి ఓపిక ప్రదర్శించారు… ఏమీ చేయలేక కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి.. రావణాసురుడు అని అన్నారు. కేసీఆర్ రావాణాసురుడా? తెలంగాణా జాతి పితా? అనే విషయం తెలంగాణా ప్రజలందరికీ తెలుసు. మీరెవరు? తెలంగాణా సాధనలో ఏమైనా పనికొచ్చారా? వ్యాపారదక్షతతో మనం ముందుకెళ్తున్నాం.. వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం.. మనకు రాజకీయంగా ఓ అవకాశం వచ్చింది. దాన్ని చూసుకుంటూ పార్టీకి ఉపయోగపడే పని చేసుకుంటూ వెళ్లాలే తప్ప.. పార్టీకి వెన్నుపోటు పొడుస్తా అంటే…? ఇవ్వాళ నువ్వేం చేశావ్? ఇదే పార్టీలో ఉన్నటువంటి కొంత మందిని పోగుచేసుకున్నావ్.. నీ ఇష్టమొచ్చిన రీతిలో టికెట్లు ప్రకటించుకున్నావ్.. ఏ పార్టీలోకి పోదామని..? జెండా లేదు, ఎజెండా లేదు.. ఎంత మందిని ‘బకరా’లను చేద్దామని నువ్వు టికెట్లు ప్రకటించుకుంటూ పోతావ్? ఎవరిస్తారు నీకు? నీకు ఈ దేశంలో ఏ పార్టీ కూడా సూట్ కాదు.. ఎందుకంటే వాళ్లు నీకు టికెట్లివ్వరు..మల్ల నీకు కోపం ఒస్తది.. నీ టికెట్ గాకుంట వాళ్లందరికీ ఇయ్యమంటవ్..వాళ్లియ్యకపోతే మళ్లా వాళ్లను ఓడించే ప్రయత్నం చేస్తవ్.. మల్ల ఇంకో దిక్కు తీస్కపోతవ్.. ఇగ నీకు రాష్ట్రంలో, ఈ జిల్లాలో పార్టీ నీకు నచ్చదు..ఇట్లాగే పంచుకుంటూ పోవాలంటే..? ఇగ నీకు ఏ పార్టీలు సూట్ కావు..నీ సొంతంగా పార్టీ పెట్టుకో.. నీ ఇష్టం వచ్చినట్లు చేస్కో..అప్పుడు కుదుర్తది. మాట్లాడితే మీరంటారు.. అధికారం ఎవడబ్బ సొమ్మని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ దాటనీయనన్నారు. అసెంబ్లీ గేటు నీ అబ్బ సొమ్మా? నీ సొమ్మా అసెంబ్లీ?’’ అని గాయత్రి రవి పొంగులేటిని నిలదీశారు. మొత్తంగా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో గాయత్రి రవి ఆగ్రహంతో ప్రసంగించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Comments are closed.

Exit mobile version