తెలంగాణా పీసీసీకి కాబోయే కొత్త అధ్యక్షునిగా ప్రాచుర్యంలో గల మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం పెద్ద విశేషం కాకపోవచ్చు. మీడియా సంస్థలు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం కూడా చర్చనీయాంశం కాకపోవచ్చు. కానీ తన రాజకీయ బద్ధశత్రువు కూటమిలోని ముఖ్య వ్యక్తి సంస్థకు చెందిన న్యూస్ ఛానల్ లో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూను సుదీర్ఘ సమయంపాటు ప్రత్యక్ష ప్రసారం చేయడమే అసలు సంచలనం. ఇంతకీ తెలంగాణా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డికి ఎంతుకీ అకస్మాత్తు ప్రాధాన్యత?? ఇదీ తాజా ప్రశ్న.
10 టీవీ, టీవీ9 తదితర న్యూస్ ఛానళ్లు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా పేరుగాంచిన మైహోం రామేశ్వరరావుకు చెందిన సంస్థలనే విషయం అందరికీ తెలిసిందే. మైహోం గ్రూపునకు చెందిన ఏ మీడియా సంస్థల్లోనూ రేవంత్ రెడ్డి వార్తగాని, విజువల్స్ గాని చూపరు. కనీసం ఓ ఎంపీ హోదాలో ఆయన పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిగాని, ఇతరత్రా రేవంత్ చేసే కామెంట్లనుగాని ఆయా సంస్థలు కనీసం స్క్రోలింగ్ కూడా వేయవు. ఓరకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్నిరకాల వార్తలపై ‘హై హోం’ మీడియా సంస్థల్లో అప్రకటిత నిషేధం అమలవుతోంది.
ఈ నేపథ్యంలో మైహోం రామేశ్వరరావుకు చెందిన 10 టీవీలో నిన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూను భారీ ఎత్తున ప్రసారం చేయడం రాజకీయ సంచలనానికి దారి తీసింది. ఇంటర్వ్యూ అంటే ముందుగానే రికార్డు చేసి, ఎడిటింగ్ చేసిన బాపతు కాదిది. దాదాపు 1.17 గంటలపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రేవంత్ అభిప్రాయాలకు 10 టీవీ పెద్దపీట వేయడం తెలంగాణా రాజకీయాల్లో విశేషాంశంగా మారింది. రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని అధికార పార్టీ నేతల రాజకీయం సాగుతోందనే ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుని మీడియా సంస్థ చేసిన ఈ ‘సాహసం’ సహజంగానే సంచలనానికి దారి తీసింది. ఇంతకీ ఏం జరుగుతోంది తెలంగాణా రాజకీయాల్లో…? ఇదే అంశంపై జర్నలిస్టు సర్కిళ్లలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బకు రాజకీయంగా కేసీఆర్ వ్యూహం మారిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మరింత బలపడితే టీఆర్ఎస్ రాజకీయంగా మరిన్నిసవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని, కాంగ్రెస్ ను కాస్త బతకనిచ్చే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి ‘మైం హోం’ మీడియా సంస్థ ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చిందా? అనే సంశయాలు కూడా రేకెత్తుతున్నాయి. మరోవైపు మై హోం రామేశ్వరరావు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు కూడా ఇదే సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి.
మొత్తంగా రేవంత్ రెడ్డికి మైం హోం గ్రూపునకు చెందిన 10 టీవీ కల్పించిన ప్రాధాన్యత తెలంగాణాలో ప్రస్తుతం హాట్ టాపిక్. దీని వెనుక గల అసలు కారణాలేమిటనే అంశంపై మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదని, ఇందుకు కాస్త సమయం పట్టవచ్చని జర్నలిస్టు సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. అయితే తొలిసారి మైహోం మీడియా సంస్థ తనకు కల్పించిన అవకాశాన్ని తనదైన శైలిలో రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారనేది వేరే విషయం.