గడచిన 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రం సేకరించేవరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లు కొనేవరకు కేంద్రంపై ఈ పోరు ఆపేది లేదని ఆయన చెప్పారు.
రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రతి రోజు పార్లమెంట్ లోపల, బయట నిరసనలు తెలపటంతో పాటు ఎన్నోమార్లు స్పీకర్ ఓంబిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చినట్టు నామ నాగేశ్వరరావు గుర్తు చేశారు. కానీ, స్పీకర్ ఓంబిర్లా తమ న్యాయపూరితమైన అభ్యర్థనకు ఏనాడూ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వెల్లడించారు. అందుకే తాము ఎన్నోసార్లు వాకౌట్ చేసినట్టు ఆయన చెప్పారు.
తెలంగాణ అన్నదాతలు చెమటోడ్చి పండించిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్ సీఐ సేకరణ చేయకపోవడంతో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చ చేయాలని అభ్యర్థిస్తే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ నామ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో ఢిల్లీ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, గల్లీలో బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ పోరు ఆగదన్నారు. అన్నం పెట్టే రైతన్నను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రపథంలో దూసుకుపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక అనేక అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.