నాగేశ్వరరావు ద్వయం. తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు. ఒకరు మాజీ మంత్రి. మరొకరు ప్రస్తుత ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు. ఈ ఇద్దరు ఉద్దండ రాజకీయ నేతలు తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు ఉప్పు, నిప్పు చందం. టీడీపీలో చంద్రబాబు వద్ద ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించలేకే ఒకరు ముందే టీఆర్ఎస్ లో చేరి నేరుగా మంత్రి కూడా అయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి కారణంగా ఆయన ‘మాజీ’ కాక తప్పలేదు. మరొకరు కాస్త ఆలస్యంగా చేరినా, సిట్టింగ్ ఎంపీని కాదని నేరుగా అధికార పార్టీ టికెట్ తెచ్చుకున్నారు. గత సాధారణ ఎన్నిక్లలో ఎంపీగా ఎన్నిక కావడమే కాదు, ఏకంగా టీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేతగా కూడా ఎంపికయ్యారు. ఈ నాగేశ్వరరావుల ద్వయం ఇప్పుడు ఏకాంత చర్చలు జరిపిన ఓ దృశ్యమే టీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చ. తన అనుచరునిగా ప్రాచుర్యం పొందిన బండి జగదీష్ అనే మాజీ సర్పంచ్ పై పోలీసులు అడ్డగోలు సెక్షన్లతో కేసు పెట్టి జైల్లో తోశారని నిన్నతుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ఓ రోజు ముందే ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా జైలుకు వెళ్లి జగదీష్ ను పరామర్శించారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు నాగేశ్వరరావులు మంగళవారం రాత్రి దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఇలా ఏకాంతంగా ముచ్చటించుకున్నారు. వాటి సారాంశం మాత్రం అడక్కండి. ఎందుకంటే… ఖమ్మం జిల్లా అధికార పార్టీలో ఎవరి ఆధిపత్యాన్ని నిలువరించడానికి ఈ ఇద్దరు నాగేశ్వరరావులు ఇలా ముచ్చటించుకున్నారనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

Comments are closed.

Exit mobile version