ఔనా? తన తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణా సీఎం కీసీఆర్ పట్టాభిషేకం చేయబోతున్నారా? ఇందుకు అంతర్గతంగా రంగం సిద్ధమవుతోందా? అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయా? గత రెండు, మూడు రోజులుగా పలు ప్రముఖ అంగ్ల పత్రికల్లోనేగాక, కొన్ని తెలుగు పత్రికల్లోనూ ( ఇవి ప్రముఖ పత్రికలు కాదు లెండి) ఇదే అంశంపై వార్తలు వస్తున్నాయి. ఎప్పటికైనా కేటీఆర్ ను సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చోబెడతారనే అంశంపై టీఆర్ఎస్ పార్టీలోనే కాదు, ఇతర రాజకీయ పక్షాల్లోనూ ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ అది ఎప్పుడనేదే కదా? అసలు ప్రశ్న.

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా రెండు రోజుల క్రితమే ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కేటీఆర్ త్వరలోనే సీఎం కాబోతున్నారని, కేసీఆర్ సూపర్ సీఎంగా వ్యవహరించబోతున్నారన్నది ఆయా పత్రికల్లో ప్రచురించిన వార్తా కథనాల సారాంశం. కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెడితే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సలహా మండలి తరహాలో తెలంగాణా సలహా మండలిని కూడా ఏర్పాటు చేస్తారని, సోనియాగాంధీ తరహాలో కేసీఆర్ చక్రం తిప్పుతారన్నని పలు పత్రికల్లో ప్రచురించిన వార్తా కథనాల్లో ఉటంకించారు. అయితే కేటీఆర్ ను సీఎం కుర్చీలో పట్టాభిషిక్తుడిని చేయడానికి ఇది సరైన సమయమేనా? కేసీఆర్ ఇందుకోసం ఆత్రుత పడాల్సిన రాజకీయ పరిస్థితులుగాని, పరిణామాలు గాని ఉన్నాయా? కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం ఇప్పటికిప్పుడు అవసరమా? అత్యవసరమా? ఇవీ రాజకీయ వర్గాల్లో నెలకొన్న అనేక ప్రశ్నల్లో కొన్ని.

రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం… కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈపాటికి కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చునేవారు కూడా. కానీ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. రాష్ట్రంలో దాదాపు ఆరు నెలల ముందస్తుగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం మినహా మిగతా ప్రాంతాల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఊపుతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగిడాలని  భావించారు. ఇందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా అనేక మందిని సీఎంలను, మాజీ సీఎంలను, పలు పార్టీల నేతలను కలిశారు. మద్ధతు కూడగట్టే యత్నం చేశారు. కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంచనా వేశారు. అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ అంచనాలను తలకిందులు చేశాయి. ఈ పరిణామాల అనంతరం మళ్లీ కేసీఆర్ నోటి వెంట ఫెడరల్ ఫ్రంట్ ఊసే లేదు. ఇదే దశలో రెండోసారి అధికారంలోకి వచ్చాక తనయుడు కేటీఆర్ కుగాని, మేనల్లుడు హరీష్ రావుకు గాని మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలపై అప్పట్లో అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. కేటీఆర్ కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పార్టీలో ‘కిరాయిదార్లు-ఓనర్లు’ అనే అంశం కలకలం రేపింది. మంత్రి ఈటెల రాజేందర్ నుంచి మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరుల నోటి నుంచి ‘ఓనర్ల’ పదం అనేక ఊహాగానాలకు ఆస్కారం కలిగించింది. అధికార పార్టీలో ఏవో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే ఊహాగానాల మధ్య సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. తనయుడు కేటీఆర్ కు, మేనల్లుడు హరీష్ రావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అంతా బాగానే ఉంది కదా? మళ్లీ ఇప్పడు తనయుడి పట్టాభిషేకానికి ఉద్యుక్తం కావలసిన అవసరం కేసీఆర్ కు ఎందుకు వచ్చింది? అనేక పత్రికల వార్తా కథనాల నేపథ్యంలో తెరపైకి వస్తున్న పలు ప్రశ్నల్లో ఇదీ ఒకటి. ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి గల కారణాలను లోతుగా, నిశితంగా పరిశీలిస్తే అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటో ఓసారి పరిశీలిద్దాం.

1. తెలంగాణా రాష్ట్రంలో మరో పార్టీ బలపడకుండా చేసే రాజకీయ ఎత్తుగడ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కకావికలం కాగా, అసెంబ్లీలో వామపక్షాల ఉనికే లేకుండా పోయింది. కోదండరాం వంటి ఉద్యమ నేత ఏర్పాటు చేసిన టీజేఎస్ ఉనికి సైతం ప్రశ్నార్థకంగానే మారింది.

2. రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ నేతలను భయపెడుతున్నట్లే కనిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేసీఆర్ కూతురు కవితనే కాదు, కుడి భుజమైన బోయినపల్లి వినోద్ కుమార్ ను కూడా బీజేపీ ఓటమి బాట పట్టించింది.

3. ఇంకా ఆలస్యం చేస్తే బీజేపీ బలపడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ఏకంగా దేశ ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇంకోవైపు చాపకింద నీరులా బీజేపీ విస్తరిస్తోంది.

4. బీజేపీ విషయంలో ప్రాంతీయ తత్వాన్ని వల్లించే అంశాలు ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును బూచీగా చూపే పరిస్థితి ఉండకపోవచ్చు. బీజేపీ బలపడుతున్నదనే ఆందోళన కూడా ఉండి ఉండవచ్చు.

5. తన కళ్లెదుటే తనయుడిని సీఎంగా చూడాలనే కాంక్ష కావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు తలకిందులైతే తనయుడిని సీఎంగా చూడాలనే కోరిక తీరే అవకాశం ఉండకపోవచ్చు.

6. ‘నౌ ఆర్ నెవర్’. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అనే భావన కావచ్చు. ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందన్న ఆలోచన కావచ్చు. పార్టీలో తిరుగుబాటు చేసే పరిణామాలు కూడా లేవనే అంచనా కావచ్చు.

7. యువకుడు, చురుకైనవాడు, అవసరమైతే అందరినీ కలుపుకుని వెళ్లగలడు. సందర్భానుసారంగా ఓ మెట్టు దిగే లక్షణం కేటీఆర్ లో ఉండి ఉండవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎటువంటి మెట్టు దిగరనే విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఇటీవలి ఆర్టీసీ సమ్మె పరిణామాలు తాజా ఉదాహరణ కూడా.

8. వీటికి తోడు కేసీఆర్ వయోభారం కూడా ఓ అంశం కావచ్చు. అందుకే ఫాం హౌజ్ లో కొత్త ఇల్లు నిర్మాణం కూడా దాదాపు పూర్తి చేయించారనే వాదన కూడా వినిపిస్తోంది.

9. ఓ అధికారిక సలహా మండలి ఏర్పాటు చేసి యూపీఏ తరహాలో తానే సూపర్ సీఎంగా వ్యవహారం నడిపించొచ్చు. తద్వారా తన కనుసైగ లేకుండా చీమ కూడా చిటుక్కుమనదనే భావన కల్పించవచ్చు. ఇదే దశలో తనయుడిని సీఎంగా చూసుకోవచ్చు.

అన్నీ ఓకే. ఇంతకీ సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పడు? అనేగా ప్రశ్న. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం దక్కించుకున్నాక జరగవచ్చు. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే యాదాద్రి నిర్మాణపు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయించిన తర్వాత కావచ్చు. లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టుకుని కేసీఆర్ తన తనయుడి పట్టాభిషేకం ప్రక్రియకు శ్రీకారం చుట్టవచ్చు.

సో… పట్టాభిషేకానికి యువరాజు సిద్దం. ఇక రాజుదే ఆలస్యం!

Comments are closed.

Exit mobile version