ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన ఉదంతం తెలంగాణా రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ‘గులాబీ జెండా ఓనర్’, భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ వంటి అనేక పరిణామాలను కాసేపు పక్కనబెడితే… బీజేపీలో చేరడానికి ముందు ఈటెల రాజేందర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజేందర్ రాజీనామా చేసి దర్జాగా ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారనేది పరిశీలకుల వాదన. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే బీజేపీలో చేరే ఛాన్స్ రాజేందర్ కు ఉందనే కొందరి వాదన కూడా అర్థరహితమే. టీఆర్ఎస్ పార్టీ నుంచి నిష్క్రమించడానికి దారి తీసిన పరిస్థితులు, పరిణామాల సంగతి ఎలా ఉన్నప్పటికీ నైతికత వైపే తమ నేత మొగ్గు చూపారనేది ఈటెల అనుచరుల వాదన. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ ఘటన పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల నైతికతను ప్రశ్నిస్తోందనే వాదన తాజాగా మళ్లీ వినిపిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నైతికతపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

సరిగ్గా రెండున్నరేళ్ల క్రితంనాటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలను ఓసారి మననం చేసుకుంటే… తెలంగాణలో 2018 డిసెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,80,64,684 మంది ఓటర్లలో 2,05,44,075 (73.20) శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజలు 88 చోట్ల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది అభ్యర్థులను గెలిపించగా, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 (రామగుండం), ఇండిపెండెంట్ అభ్యర్థులు (వైరా) ఒక స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక పోయాయి. పార్టీలవారీగా లభించిన ఓట్లను పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీకి 46.9 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 28.4 శాతం ఓట్లు, బీజేపీకి 7 శాతం ఓట్లు, టీడీపీకి 3.5 శాతం ఓట్లు, ఎంఐఎం 2.7 శాతం ఓట్లు, ఇతరులకు 10.3 శాతం ఓట్లు లభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు 97,00,749 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 58,83,111 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 14,50,456 ఓట్లు, టీడీపీకి 7,25,845 ఓట్లు, ఎంఐఎంకు 5,61,089 ఓట్లు పోలయ్యాయి.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించగా, అందులో ఇపుడు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలడం గమనార్హం. మిగతా వారంతా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా, రేగా కాంతారావు ప్రభుత్వ విప్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున గెల్చిన సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావులు కూడా అధికార పార్టీలో చేరి టీడీఎల్పీని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేశారు. అయితే ఒక పార్టీ బీ ఫారం మీద విజయం సాధించి, అధికార పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ తరహాలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తమ నైతికతను చాటుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఆత్మగౌరవం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు శాసనభ్యత్వాన్ని వదులుకుని, కారు గుర్తుపై మళ్లీ పోటీ చేసి గెలవాలనే సారాంశంతో సోషల్ మీడియా పోస్టులు హోరెత్తుతున్నాయి. ఆయా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని రూలింగ్ పార్టీని కూడా ఆయా పోస్టుల్లో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సిద్ధపడతారా? గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ సారు అందుకు పురమాయిస్తారా? అనే ప్రశ్నలపై భిన్న చర్చ జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version