తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పోకడపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాలకు కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని నిందించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన పరిణామాలపై నారాయణ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ లో జరిగిన రాజకీయ పరిణామాలే తెలంగాణలో పునరావృతమవుతాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ రాజకీయ ప్రయాణం జారుడుబండపై జారాక సహజంగానే విప్లవ వాగాడంబరం నుండి మితవాదం వైపు పోతుందని వ్యాఖ్యానించారు. పరమానందయ్య శిష్యులు సూదిని మోసినట్లు చందంగా బీజేపీ రాష్ట్ర అతిరథ మహారధులందరూ ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లి ఈటలకు కమలం కండువా కప్పి చేర్చుకున్నారని అన్నారు. ఒకవైపున బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన ‘ఆటోక్రసీ’ (నిరంకుశత్వం) వైపు పయనిస్తున్నదని నారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం వలన ప్రజాస్వామ్య శక్తులు ఇబ్బందులు పడటం వాస్తవమన్నారు.

ఫలితంగా ఉద్యమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో కూడా విఫలమవుతున్నారని అన్నారు. ఈ సందర్భంలో బీజేపీకి అపోజిషన్ స్థానం కల్పించింది కేసిఆరే అని ఆయన వ్యాఖ్యానించారు. వెస్ట్ బెంగాల్ తరహాలో రాజకీయాలు నడిపించాలనే ప్రయత్నం సాగుతున్నదని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈటెల రాజేందర్ చేరడమని అన్నారు. ఆ తర్వాత క్రమంలో రాబోయే పరిణామాలు ఎంత ప్రమాదంగా మారబోతాయో వేచి చూడాలన్నారు. అదే జరిగితే వామపక్ష శక్తులు, లౌకిక పార్టీలు, కాంగ్రెస్ తో సహా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయన్నారు. ఆలస్యం జరిగితే వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిస్తే కూడా ఎదుర్కోలేనీ పరిస్థితి వచ్చేసిందన్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం సాధ్యం కాదని, వామపక్ష శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు, కాంగ్రెస్ పార్టీతో సహా పరిణామాలపై ఆలోచించుకోకపోతే, తగిన ఎత్తుగడలు లేకుండా పోతే తప్పనిసరిగా వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిణామాలు తెలంగాణలో పునరావృతం అవుతాయని, అందరూ కలిసి జాగ్రత్త పడాలని నారాయణ హెచ్చరించారు. ఆయా వ్యాఖ్యలతో నారాయణ విడుదల చేసిన వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version