తెలంగాణా సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదా? స్థానిక నేతల వర్గపోరు పార్టీ సభ్యత్వ నమోదుపై తీవ్ర ప్రభావం చూపుతోందా? తాను ఎంతగానో విశ్వసించిన స్థానిక నాయకుల పనితీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అందువల్లే స్వయంగా తన ఇద్దరు వ్యక్తిగత సహాయకు (పీఏ)లను రంగంలోకి దించారా? కేటీఆర్ పీఏలైన తిరుపతి, మహేందర్ రెడ్డిలు సిరిసిల్లలో మకాం వేసి పార్టీ సభ్యత్వ నమోదును నేరుగా పర్యవేక్షిస్తున్నారా? ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తూ, ఔననే విధంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఔను… మంత్రి కేటీఆర్ పీఏలుగా పనిచేస్తున్న తిరుపతి, మహేందర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు సిరిసిల్ల కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత సేకరణ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న చిత్రాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో సంగతి ఎలా ఉన్నప్పటికీ, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ భావి ముఖ్యమంత్రిగా ప్రాచుర్యం పొందిన కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో పార్టీ సభ్యత్వ ప్రాముఖ్యత మరింతగా ఉంటుందనేది కాదనలేని అంశం. ఇందులో భాగంగానే సిరిసిల్ల నియోజకవర్గంలో కనీసం లక్ష మంది లక్ష్యంగా సభ్యత్వ నమోదు చేయించాలని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించినవారికి రూ. 2 లక్షల వరకు ప్రమాదా బీమాను కూడా వర్తింపజేస్తున్నారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు స్వయంగా మేనబావ అయిన చీటి నరసింగరావు, టెస్కాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్ రావు, సెస్ మాజీ చైర్మెన్ చిక్కాల రామచందర్ రావు వంటి కీలక నేతలు ఉన్నారు. వీరుగాక ఇంకా అనేక మంది ప్రాధాన్యతగల నాయకులు కూడా ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు నిన్నటి వరకు గడువు ఉండగా, ప్రస్తుతం మరో ఇరవై రోజుల వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఆశించిన విధంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగడం లేదనే ప్రచారం జరుగుతోంది. పార్టీలోని కీలక నేతలు, ముఖ్య నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ, వర్గపోరు కారణంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సవాల్ గా స్వీకరించడం లేదంటున్నారు. పక్కనే గల మంత్రి హరీష్ రావు నియోజకవర్గమైన సిద్ధిపేటలో పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోందట. కానీ సిరిసిల్లలో ఎవరికీ పట్టని విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తయారైందనే విషయం మంత్రి కేటీఆర్ చెవిన పడినట్లు సమాచారం.
‘పార్టీ కన్నతల్లి లాంటిది. ఇంటింటికీ వెళ్లండి. నిర్దేశిత లక్ష్యం మేరకు టీఆర్ఎస్ సభ్యత్వాలు చేయించండి. పాత పంచాయతీలు, కొట్లాటలు పక్కనపెట్టండి. ఈ పదిహేను రోజులు విశాల హృదయంతో పనిచేయండి…’ అని మంత్రి కేటీఆర్ స్వయంగా గత నెల 12వ తేదీన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సూచించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లభించలేదని అంటున్నారు. దీంతో తన వద్ద గల నలుగురు పీఏల్లోని ఇద్దరైన తిరుపతి, మహేందర్ రెడ్డిలను సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ పంపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వీరిద్దరు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ జోరుగా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయించడంలో కేటీఆర్ పీఏలు బిజీ బిజీగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. సాక్షాత్తూ సీఎం కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇద్దరు పీఏలు రంగంలోకి దిగి పార్టీ సభ్యత్వ నమోదును స్వయంగా పర్యవేక్షిస్తుండడడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.