వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతలి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్, సిసి కెమెరాలు, భక్తులకు అన్నదానం వంటి అనేక వసతుల కల్పనపై ఆయాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. కోటి రూపాయలతో ఐనవోలులో శాశ్వత ప్రాతిపదికన బాత్ రూం ల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డిని మంత్రి అభినందించారు. అలాగే జాతరలో నిరంతర శానిటేషన్ కి అంగీకరించిన మేయర్ గుండా ప్రకాశరావును కూడా మంత్రి అభినందించారు.
కోవిడ్ నేపథ్యంలోతప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ఉంటేనే దర్శనం కలిగించాలని చెప్పారు. వైద్య శాఖతో పాటు, ఆరూరీ గట్టుమల్లు ట్రస్ట్ నుండి మాస్కు లు పంపిణీ చేయాలని సూచించారు. వీఐపీలకు, దాతలకు ప్రత్యేక పాసులు జారీ చేసి, నిర్ణీత సమయాల్లో నేరుగా దర్శనాలు చేయించాలన్నారు. భక్తులకు దర్శనార్థం చేసే ఏర్పాట్లలో కరోనా నిబంధనలు పాటించాలన్నారు. భక్తులు కిక్కిరిసి పోకుండా, సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఆర్టీసీ అదనంగా 25 బస్సులు నడపాలని నిర్ణయించింది. కాగా, రోడ్ల మరమ్మతులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ఫైర్ ఇంజన్, వైద్య సదుపాయాలు తదితర అంశాలవారీగా మంత్రి సమీక్షించారు. అంతకుముందు మంత్రి ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తోపాటు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.