ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక చర్చకు దారి తీస్తున్న అంశమిది. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశావహుల రేసులో అకస్మాత్తుగా ఓ నాయకుడు తెరపైకి రావడమే అసలు విశేషం. ఎంపీ టికెట్ల రేసులో ముందున్న కాంగ్రెస్ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారుండగా, తాను కూడా ఉన్నానంటూ ఓ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకీ ఎవరా నాయకుడంటే.. పేరు జెట్టి కుసుమ కుమార్. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఎంపీ టికెట్ ఆశావహుల జాబితాలో రెండ్రోజుల క్రితం వరకు ప్రసార మాధ్యమాల్లో ఎటువంటి ఊసులో లేని జెట్టి కుసుమ కుమార్ అకస్మాత్తుగా తెరపైకి ఎందుకు వచ్చారు? రాజధానిలో ఉండే జెట్టి అర్జంటుగా ఖమ్మం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లు ప్రకటించడంలో అసలు ఆంతర్యమేంటి? కాంగ్రెస్ పార్టీ నేతగా టికెట్ అడిగే హక్కు కుసుమ కుమార్ కు ఉందనే అంశంలో ఎటువంటి వివాదం లేదు. కానీ కుసుమ కుమార్ ఖమ్మం డీసీసీ ఆఫీసుకు వచ్చి ప్రెస్ మీట్ లో వెల్లడించిన అంశాలు అత్యంత ఆసక్తికరంగా ఆ పార్టీ శ్రేణులే అభివర్ణిస్తున్నాయి. ఎంపీ టికెట్ తాజా రాజకీయంలో జెట్టి కుసుమ కుమార్ ఎవరు వదిలిన బాణం..? అనే ప్రశ్న ప్రామాణికంగా లోతైన చర్చ జరుగుతోంది.

ఖమ్మం ఎంపీ టికెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డికి దాదాపుగా ఖాయమైనట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కుసుమ కుమార్ ఎంటర్ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుసుమ కుమార్ తన ప్రెస్ మీట్లో వెల్లడించిన కీలక వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని జెట్టి కోరడం గమనార్హం. ఎన్ఎస్ యూఐ నాయకుడిగానేగాక, అనేక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఇంచార్జిగా పనిచేశానని జెట్టి గుర్తు చేశారు. ఇలా అనేక అంశాలను జెట్టి ప్రస్తావిస్తూ, సీనియారిటీ ప్రకారం చూసినా తనకు టికెట్ కేటాయించే అవకాశం ఉండడంతో తాను దరఖాస్తు కూడా చేసినట్లు వివరించారు.

పొంగులేటి ప్రసాదరెడ్డి

అయితే టికెట్ రేసులో గడచిన కొంతకాలంగా జెట్టి పేరు పెద్దగా వార్తల్లోకి రాలేదు. తాజా పరిణామాల్లో జెట్టి హుటాహుటిన ఖమ్మం చేరుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను కూడా రేసులో ఉండడానికి గల ప్రాధాన్యతాంశాలను వెల్లడించిన తీరు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎంపీ టికెట్ రేసులో పొంగులేటి ప్రసాదరెడ్డి ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న పరిణామాల్లో తాజా సీన్ అత్యంత ఆసక్తికరంగా పరిశీలకులు చెబుతున్నారు. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కుమారుడు యుగంధర్, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రసాదరెడ్డి, నందిని, యుగంధర్ ల టికెట్ ప్రయత్నం వెనుక మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల అండ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కానీ వీవీసీ రాజాగా పిలువబడే వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కు మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కమ్మ సామాజికి వర్గానికి టికెట్ కేటాయించే పరిస్థితులను చక్కదిద్దడానికే రేణుకాచౌదరికి రాజ్యసభ సీటును పార్టీ కేటాయించిందనే వాదన ఉండడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ ఘటనతో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ ఖరారైనట్లుగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉంది. తాజా సమాచారం ప్రకారం కూడా ప్రసాదరెడ్డి ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండడానికి గల వ్యతిరేకాంశాలు ఏవీ లేవనే బలమైన వాదన కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. కానీ తాజాగా జెట్టి కుసుమ కుమార్ తెరపైకి వచ్చి తానూ టికెట్ రేసులో ఉన్నానని ప్రకటించడం వెనుక పకడ్బందీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది.

వీవీసీ రాజేంద్ర ప్రసాద్

కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించే పరిస్థితుల్లో తనకే టికెట్ ఇవ్వాలని కుసుమ కుమార్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని, అందువల్లే తాను కమ్మ సామాజికవర్గమని ఆయన బాహాటంగా ప్రకటించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీవీసీ రాజాకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కట్టడి చేసే వ్యూహంలో భాగంగా కుసుమ కుమార్ ను బాణంగా వదిలారనే కామెంట్లు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే తుమ్మల తనయుని ప్రయత్నాలకు కూడా చెక్ పడినట్లుగా భావించవచ్చంటున్నారు.

మల్లు నందిని

అంతేకాదు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించని పరిస్థితుల్లో పొంగులేటి సోదరునికి కూడా ఇవ్వవద్దని అడ్డు తగులుతూ మరో పేరును టికెట్ రేసులో ముందుకు తీసుకువచ్చేందుకు కుసుమ కుమార్ ను వ్యూహాత్మకంగా రంగంలోకి దించారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. ఈ వ్యూహం వెనుక గల నాయకుడి పాత్రపైనా భిన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు వ్యవహారం మున్ముందు మరిన్ని ఆసక్తికర మలుపులకు దారి తీసే అవకాశాలను పరిశీలకులు తోసిపుచ్చలేకపోతున్నారు.

ఇమేజ్: ఖమ్మం డీసీసీ ఆఫీసులో జెట్టి కుసుమ కుమార్ మాట్లాడిన చిత్రం

Comments are closed.

Exit mobile version