పచ్చగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మీనగట్ట ఆదివాసీ పల్లె వాతావరణం. రెండు గుంపులతో కనిపించే మీనగట్ట గిరిజన గ్రామం ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లోనేకాదు, తెలంగాణా రాష్ట్రంలోనూ వార్తల్లోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్ మరణించాడనే వార్త నేపథ్యంలో వార్తల్లో మార్మోగుతున్న గిరిజన గూడెం మీనగట్ట. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుంచి తాలిపేరు ప్రాజెక్టు మీదుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని అడవుల్లోకి ప్రవేశించాల్సిందే. పామేడు పోలీస్ పరిధిలో గల మీనగట్టకు చేరుకోవాలంటే అడవికి అడ్డంపడి దాదాపు 45 కి.మీ. ప్రయాణించాల్సిందే. చర్లకు 18 కిలోమీటర్ల దూరంలో గల పామేడు వరకు ప్రయాణం సజావుగానే సాగుతుంది. అక్కడి నుంచే అసలు యాతన మొదలవుతుంది. లోతైన వాగుల ప్రవాహాన్ని నాటుపడవ ద్వారా దాటుకుని రాళ్లు, రప్పల మార్గంలో మరో 27 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప మీనగట్టకు చేరుకోలేం. వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణం మరింత కష్టతరం.
ఇప్పుడీ మీనగట్ట గ్రామం ఓ ముఖ్యవార్తకు కేంద్రబిందువుగా మారింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ అనారోగ్యంతో ఇక్కడే చనిపోయారని, ఇంకా అనేక మంది నక్సలైట్లు కరోనా బారినపడ్డారని, తమకు లొంగిపోతే వైద్యం చేయించి, ప్రభుత్వపరంగా రావలసిన అన్ని సాయాలను అందిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్, ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, సుక్మా ఎస్పీలతోపాటు తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఎస్పీలు సైతం హరిభూషణ్ చనిపోయినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 21వ తేదీన హరిభూషణ్ మరణించినట్లు అటు ఛత్తీస్ గఢ్, ఇటు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్ అధికారులు వరుసగా ప్రకటిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల తెలంగాణా పోలీసులకు చిక్కిన నక్సల్ నేతలు గంగాలు, శోబ్రాయ్ ల మరణాల ఘటనల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ పత్రికా ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈనెల 18వ తేదీన జారీ చేసిన ఆ ప్రకటనలో అభయ్ ఏమన్నారంటే… కరోనాతో మావోయిస్టుల మరణం అనేది ఒక బూటకంగా, అది పోలీసుల సృష్టిగా అభివర్ణించారు. తమ పార్టీపై పోలీసుల దుష్ప్రచారం ఈనాడు కొత్తేమీ కాదని, గతంలో తమ పార్టీ నాయకత్వం రోగాల పాలై, మంచాన పడిందని కల్పిత కథనాలను ప్రచారం చేశారని ఆరోపించారు. ఇటీవలే తమ పార్టీ ప్రధాన నాయకత్వం లొంగుబాటుకు సిద్ధమైందంటూ సంచలనాత్మక వార్తలను విడుదల చేశారన్నారు. ఇప్పుడు తమకు కరోనా సోకిందంటున్నారని అభయ్ పేర్కొన్నారు. కరోనా వ్యాధితో మావోయిస్టుల మరణాలు, కేడర్లను చికిత్సకు అనుమతించడం లేదంటూ పోలీసులు జరుపుతున్న ప్రచారమంతా బూటకమే తప్ప, అందులో రవ్వంత కూడా వాస్తవం లేదన్నారు. అలా మరణాలే జరిగి ఉంటే తమ పార్టీ ఎలాంటి దాపరికం లేకుండా నిరభ్యంతరంగా ప్రకటిస్తుందని, మావోయిస్టులు మానవాతీతులేమీ కాదని, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ప్రజల మద్య పనిచేస్తున్న మావోయిస్టులకు సోకదనే గ్యారంటీ ఏమీ లేదన్నారు. కాకపోతే ఇప్పటి వరకు తమ ఉద్యమ ప్రాంతాల ప్రజలకు, తమకు కరోనా మహమ్మారి సోకలేదనే వాస్తవాన్ని తాము తెలియజేస్తున్నట్లు అభయ్ ప్రకటించారు. పోలీసులు ప్రకటించిన జాబితాలోనివారు సహా తమ పార్టీలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు కరోనా సోకలేదన్నారు.
అయితే అభయ్ ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ చనిపోయినట్లు ఈనెల 22వ తేదీన వార్తలు ప్రాచుర్యంలోకి రావడం గమనార్హం. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారుల ప్రకటన నేపథ్యంలోనే భద్రాచలం డివిజన్ లోని చర్ల ప్రాంతానికి చెందిన మీడియా బృందం సాహసించి మీనగట్ట గిరిజన గూడేనికి బుధవారం వెళ్లింది. అయితే హరిభూషణ్ మరణించారనే వార్తలపై తమకు ఎటువంటి సమాచారం లేదని మీనగట్టు ఆదివాసీలు విలేకరులతో చెప్పారు. పామేడు ఎన్కౌంటర్ ఘటనకు బాధ్యులుగా చేస్తూ నక్సలైట్లు 2008లో కొందరు గ్రామస్తులను ఊచకోత కోసిన కంచాల సమీపంలోనే మీనగట్ట ఆదివాసీ గుంపులు ఉన్నాయి. స్థానిక ఆదివాసీలు ‘లక్మాదాదా’గా పిల్చుకునే హరిభూషణ్ క్షేమంగానే ఉన్నట్లు మీనగట్ట ఆదివాసీల మాటల్లోని భావనగా స్ఫురించినట్లు వార్తలు వెలువడ్డాయి. స్థానిక మిలీషియా సభ్యులు కూడా కొందరు హరిభూషణ్ మరణవార్తను కొట్టిపారేసినట్లు మీనగట్టుకు వెళ్లిన విలేకరుల్లో కొందరు చెబుతున్నారు. అయితే మీనగట్టు పక్కనే ఏడు కిలోమీటర్ల దూరంలో జబ్బగట్ట అనే ఆదివాసీ గుంపు కూడా ఉంది. మీనగట్ట, జబ్బగట్టల మధ్య నాలుగు కిలోమీటర్ల పరిధిలో బొక్కరాజు గుట్ట అటవీ ప్రాంతం ఉంది. ఈ గుట్టల్లోనే హరిభూషణ్ మరణించినట్లు పోలీసు వర్గాలకు సమాచారం ఉందట. బొక్కరాజు గుట్టల్లోనే హరిభూషణ్ ఎక్కువగా మకాం వేస్తుంటాడని, మీనగట్ట, జబ్బగట్ట, కంచాల తదితర ప్రాంతాల్లో మావోలకు గట్టి పట్టు ఉందనేది పోలీసుల అంచనా.
హరిభూషణ్ మరణించినట్లు పోలీసు అధికారులు కొందరు ప్రకటించిన మీనగట్టకు చెందిన ఆదివాసీలు మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో హరిభూషణ్ మరణ వార్తపై మావోయిస్టు పార్టీ స్పందిస్తే తప్ప అసలు విషయం ధ్రువపడే అవకాశం లేదనేది విప్లవ కార్యకలాపాల పరిశీలకు భావన.