ఇవి కల్పిత ఘటనలు కావు. వాస్తవిక ఉదంతాలు. కాకపోతే సాంకేతిక కారణాల వల్ల పేర్లను, ప్రాంతాలను కోట్ చేయడం లేదు అంతే. వీఐపీలతో కలిసి చేసే భోజనాలకు అర్థం, పరమార్థం, ఆర్థిక బంధం వంటి అంశాలు ఎలా ముడిపడి ఉంటాయో తెలుసుకోవలసిన అవశ్యకతను ఈ ఘటనలు మనకు చెప్పకనే చెబుతాయి.

మొదటి ‘లంచ్’ విషయంలోకి వస్తే అనగనగా ఓ మాజీ మంత్రి. అప్పట్లో మంత్రి లెండి. ఉమ్మడి రాష్ట్రమా? ప్రత్యేక తెలంగాణానా? అని మాత్రం అడక్కండి. ఆ మంత్రికి తమ ముఖ్య నాయకుడి నుంచి ఉదయాన్నే ఓ ఆదేశం వచ్చింది. నిత్యం మన పార్టీ శ్రేయస్సు కోరే ఓ పెద్దాయనను కలిసి రావాలన్నది ఆదేశపు సారాంశం. సరే…నాయకుడి ఆదేశం పాటించకతప్పని పరిస్థితుల్లో ఆ మంత్రిగారు తన కాన్వాయ్ తో ఆ పెద్దాయనను కలవడానికి వెళ్లాడు. అయితే ఆ పెద్దాయన నివాసం గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది మంత్రి అని కూడా చూడకుండా నకశిఖ పర్యంతం చెక్ చేశారు. ఆ తర్వాత ఈ మంత్రిగారు పెద్దాయనను కలిసి నాయకుడు కలిసి రమ్మన్నట్లు చెప్పారు. చేతిలో ఏమీ కనిపించకపోవడంతో, మీ నాయకుడు ఏమీ చెప్పలేదా? అని మంత్రిని ఆ పెద్దాయన ప్రశ్నించారు. ఏమీ చెప్పలేదే? కలిసి రమ్మన్నారు… అని మంత్రి జవాబిచ్చారు.

అయితే మరోసారి మీ నాయకున్ని కలిసి, విషయాన్ని పూర్తిగా కనుక్కుని రా…అని పెద్దాయన మంత్రికి కనీసం టీ కూడా ఇవ్వకుండా వెనక్కి పంపారు. సరే నాయకున్ని కలిసి, అసలు విషయం తెలుసుకుని దాదాపు అయిదు ‘సీ’ లు… అదేనండీ? రూ. అయిదు కోట్ల బ్రీఫ్ కేస్ పెద్దాయన చేతిలో పెట్టి నమస్కారం చేశారు. ఇక చూడండి. ఆ పెద్దాయన తన మందీ మార్బలంతో మంత్రిగారికి మామూలు మర్యాద చేయలేదు. చక్కటి, తళ తళ మెరిసే కొత్త వెండి కంచంలో షడ్రుచులతో కూడిన భోజనాన్ని వడ్డింపజేశారు. ఇంత పెద్దాయన తనకు వెండి పళ్లెంలో భోజనం పెట్టడమే మహద్భాగ్యంగా భావించిన మంత్రి ధన్యవాదాలు చెప్పి భుక్తాయాసంతో  ఆయన నుంచి సెలవు తీసుకున్నారు.

కొంత కాలం గడిచాక మంత్రికి డబ్బు అవసరమైంది. ఎన్నికలు రావడంతో ఖర్చులకు ఉపయోగపడతాయని ఈ మంత్రి సదరు పెద్దాయనను కలిసి తన ఐదు ‘సీ‘లు తిరిగి చెల్లించాలని కోరాడు. అదేమిటి? మళ్లీ అడుగుతున్నావ్? మీ నాయకుడేమీ చెప్పలేదా? అని ఆ పెద్దాయన మంత్రిని చీవాట్లు పెట్టినంత పనిచేశాడు. ఏం చేయాలో తెలియక తన పరిస్థితిని మంత్రి తమ నాయకుడి వద్దే మొర పెట్టుకున్నడు. అదేమిటండీ? ఆయనతో కలిసి వెండి కంచంలో భోజనం చేశారుగా? మళ్లీ డబ్బు అడగుతారా? ఏమన్నా మర్యాదగా ఉంటుందా చెప్పండి? మీరే కాదు, మీ లాంటి వాళ్లు ఇంకా చాలా మంది ముఖ్యులతో ఆయనకు సాయం చేయించాను. ఆ ఐదు కోట్ల సంగతి మర్చిపోండి. ఆయనతో కలిసి భోజనం చేయడమే అదృష్టంగా భావించండి. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం, మనం చూసుకుందాం అని నాయకుడు హితబోధ చేయడంతో అవాక్కవడం మంత్రి పనైంది. ఈ విషయాన్ని సదరు ప్రస్తుత మాజీ మంత్రి అప్పట్లోనే తన అంతరంగిక ముఖ్యులతో ఐదు ‘సీ’లు, వెండి కంచం భోజనం గురించి చెప్పుకుని బావురుమన్నాడు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి అది వేరే విషయం. ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఆ వీఐపీ అనబడే పెద్దాయనతో కలసి చేసిన ‘వెండి‘ కంచం భోజనం ఖరీదు అక్షరాలా ఐదు కోట్ల రూపాయలన్న మాట. కాకపోతే ఈ ఐదు ‘సీ’లను మంత్రి చే బదులుగా భావించారట.

ఇక రెండో ‘లంచ్’ ఘటనకు వద్దాం. ఉత్తర తెలంగాణా జిల్లాలోని ఓ ముఖ్య నగరం. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఒకాయన ఇరవై ఏళ్ల క్రితం తనకు గల సుమారు రెండున్నర ఎకరాల భూమిని ఓ పెద్ద వ్యాపారవేత్తకు విక్రయించారు. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన డబ్బులో రూ. 6.00 లక్షలు మినహా మిగతా మొత్తాన్ని దఫ, దఫాలుగా చెల్లించారు. ఇంత పెద్ద బిజినెస్ మేన్ తన డబ్బు చెల్లించకుండా ఎగ్గొడతాడా? అనే నమ్మకంతో భూ విక్రయదారుడు రిజిస్ట్రేషన్ కూడా చేశాడు.  కానీ ఆరు లక్షల మొత్తాన్ని మాత్రం ఆ వ్యాపారవేత్త ఎంతకీ చెల్లించడం లేదు. భూమిని విక్రయించిన వ్యక్తి చెప్పులు అరుగుతున్నాయే తప్ప డబ్బు మాత్రం వసూలు కావడం లేదు. దాదాపు రెండేళ్లు గడిచాయి. ఈ లోగా ఆ భూమిలో తన వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన ఆఫీసు నిర్మించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్రంలోని ఓ ప్రముఖ ఉద్యమ నేత కూడా వచ్చారు. ఆఫీసు ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇదే సందర్భంగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆఫీసుకు రిబ్బన్ కత్తిరించిన ఉద్యమ నాయకుడితో కలిసి వ్యాపారవేత్త, భూ విక్రయదారుడు కలిసే భోజనం చేశారు. కార్యక్రమం ముగిసింది. కొద్ది రోజుల తర్వాత భూమిని విక్రయించిన వ్యక్తి వ్యాపారవేత్తను కలిసి, సార్…నా భూమిలో మీరు ఆఫీసు కూడా కట్టుకున్నారు. ఓపెనింగ్ కూడా చేయించారు. కానీ నాకు ఇవ్వాల్సిన చివరి ఆరు లక్షల మొత్తం గురించి తిరుగుతూనే ఉన్నాను. ఇస్తే సంతోషంగా వెళ్లిపోతానంటూ ప్రాధేయపడినంత పనిచేశాడు. అయితే ఈ చివరి చెల్లింపు మొత్తానికి సంబంధించి ఆ వ్యాపారవేత్త చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ‘అదేంటయ్యా? డబ్బులు అడుగున్నావ్? ఆఫీసు ఓపెన్ చేసిన రోజు అంత పెద్ద ఉద్యమ నాయకుడి పక్కన కూర్చోబెట్టి నీకు భోజనం పెట్టించాను. ఇంకా ఆరు లక్షలేమిటి? అంత అదృష్టం నీకు దక్కుతుందా చెప్పు? అని ఎదురు ప్రశ్నించడమే కాదు…మళ్లీ ఆరు లక్షల మాట ఎత్తితే బాగుండదనే తరహాలో ముఖ కవళికలు పెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఆ భూమిని విక్రయించిన వ్యక్తి తన ఆరు లక్షల కోసం ఇప్పటికీ దిక్కులు చూస్తూనే ఉన్నాడు పాపం.

అడగబోతే వీవీఐపీకి కోపం…అడగకపోతే అసలుకే శాపం. ఇదీ ఈ లంచ్ ‘కత’ల్లోని నీతి.

Comments are closed.

Exit mobile version