ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. ముఖ్యంగా ఖమ్మం నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ‘సేఫ్’గా భావించిన వారు తాజా స్థితిపై బెంబేలెత్తుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన సోమవారం నాటి నివేదిక ప్రకారం జిల్లా వ్యాప్తంగా 585 విదేశీయుల రాకను గుర్తించారు. వీరందరికీ హోం క్వారంటైన్ పూర్తయింది. ఇదే దశలో 48 మందిని స్పెషల్ క్వారంటైన్లో ఉంచారు. మరో ఏడుగురిని సాధారణ క్వారంటైన్ కు తరలించారు. మొత్తం 1,241 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తూ ఐసొలేషన్ వార్డులో ఔట్ పేషెంట్లుగా, 354 మందిని ఇన్-పేషెంట్లుగా చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటివరకు మొత్తం 337 మందికి నమూనాలు సేకరించగా, 275 మందికి కరోనా నెగిటివ్, ఏడుగురికి పాజిటివ్ నివేదికలు వచ్చాయి. మరో 55 మందికి సంబంధించిన ఫలితాలు రావలసి ఉంది. ఖమ్మం నగరంలో నమోదైన ఏడు పాజిటివ్ కేసుల్లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకడం గమనార్హం. నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఖమ్మం ఖిల్లా, మోతీనగర్, పెదతండా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
అయినప్పటికీ ఖమ్మం నగరవాసుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. లాక్ డౌన్ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అకారణంగా బయటకు రావడమే కాదు, రోడ్లపై వాకింగ్ చేస్తూ ‘ఎల్లయ్య కొలువు, మల్లయ్య గేదెలు’ తరహాలో టైంపాస్ ముచ్చట్లు పెడుతున్నారు. విషయం నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ చెవిన పడడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. కాలక్షేపం కోసం వీధుల్లో తిరుగుతున్న 175 మందిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించి వారిపై కేసులు నమోదు చేశారు. గడచిన మూడు రోజులుగా ఈ వాకర్స్ ఇదే తంతు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫొటోల్లో మీరు చూస్తున్న దృశ్యాలు టైంపాస్ వాకర్స్ బాపతే. నగర పోలీస్ కమిషనర్ వారికి ‘క్లాస్’ తీసుకుంటున్నప్పటి చిత్రాలే.