కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ అమలు అంశంలో తెలంగాణా ప్రభుత్వపు తాజా ఆలోచన ఏమిటి? పునరాలోచన దిశగానే సర్కారు అడుగులకు పునాది పడుతున్నదా? మే 7వ తేదీ తర్వాత క్రమేణా లాక్ డౌన్ ఎత్తివేత దిశగా ప్రభుత్వం పయనిస్తున్నదా? అనే ప్రశ్నలకు ఔననే విశ్వసనీయ సమాచారం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి.

లాక్ డౌన్ అమలు వల్ల ప్రభుత్వ ఆదాయపు సంగతి ఎలా ఉన్నప్పటికీ, పేదల ఉపాధి తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్నదనే అంశంపైనే సీఎం కేసీఆర్ తీవ్రంగా యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కల్లోల వాతావరణంలో పేదలకు ప్రభుత్వం ఎంతగా అండగా ఉండి సాయం అందిస్తున్నప్పటికీ, నిరవధిక లాక్ డౌన్ అమలు ద్వారా ఇది ఎల్లకాలం కష్టతరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి లాక్ డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పేదల జీవనోపాధి పూర్తి స్థాయిలో ధ్వంసమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న చిన్న షాపులు, మధ్యతరహా పరిశ్రమలు సైతం మూతపడితే… తిరిగి కోలుకోవడంకూడా కష్టమనే వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాల్లోనే తెలంగాణా సీఎం కేసీఆర్ మే 7 తర్వాత లాక్ డౌన్ అమలు గురించి తీవ్ర స్థాయిలో మథనపడుతున్నట్లు సమాచారం.

తెలంగాణా రాష్ట్రంలో కరోనా తాాజా పరిస్థితిపై సీఎం కేసీఆర్ తోపాటు ఇతర మంత్రులు కూడా తమ స్వరాన్ని ఒకే మాటగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో వరుసగా ఆరో రోజు కూడా కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని పాలకులు వెల్లడిస్తున్న నేపథ్యంలోనే అధికార పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణా’ సైతం ఇదే అంశాన్ని వార్తా కథనాలుగా నివేదిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారినట్లు ఆ పత్రిక తాజా కథనం. మంగళవారం ఆరుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తున్న నేపథ్యంలో నిర్దేశించిన ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. మే 7వ తేదీ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత క్రమంగా అమలు జరగవచ్చంటున్నారు. కరోనా తీవ్రత గల ప్రాంతాల్లో మినహా, మిగతా ఏరియాల్లో లాక్ డౌన్ ఎత్తివేతకే ప్రభుత్వం మొగ్గు చూపవచ్చంటున్నారు. నగరాలు, పట్టణాల్లో మాత్రం యథాతథంగా లాక్ డౌన్ అమలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు సామూహికంగా గుమిగూడే అన్ని ప్రాంతాల్లో… అంటే సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్ల వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు ఎప్పటిలాగే అమలు కావచ్చంటున్నారు.

ఇదే దశలో గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలను కొనసాగించే దిశగా సడలింపులు ఇస్తే బాగుటుందని అధికారులు కొందరు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. కానీ రెడ్, ఆరెంజ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని కూడా అధికార వర్గాలు సలహా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేదల ఉపాధి లక్ష్యంగా తెలంగాణాలో కరోనా రహిత ప్రాంతాలుగా మారిన 22 జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తివేతకే ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని ఓ అంచనా.

మొత్తంగా గమనించాల్సిన అంశమేమిటంటే ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ పొడిగించాలని తెలంగాణా సీఎం పట్టుబట్టకపోవడం గమనార్హం. అంతకు ముందు జరిగిన కాన్ఫరెన్సుల్లో అన్ని రాష్ట్రాల సీఎంలకన్నా ముందుగానే లాక్ డౌన్ పొడిగించాలని కేసీఆర్ పట్టుబట్టడం విశేషం. ఆయా పరిణామాలు తెలంగాణాలోని 22 కరోనా రహిత జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తివేయవచ్చనే అంచనాకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version