గుక్కెడు మందు దొరక్క లిక్కర్ వ్యసనపరులు ఆ మధ్య ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్ పరిణామాల్లో లిక్కర్ షాపులకు కూడా లాక్ పడింది. దీంతో మందు దొరక్క అనేక మంది సామాన్య మద్యపాన ప్రియులు వింత ప్రవర్తనతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి పాలవుతున్నారు. ఇదంతా పేదవాడి గోడు. కనీసం తాటి కల్లు దొరుకుతుందా? అంటే దాన్ని కూడా చాలా చోట్ల కల్తీ చేస్తున్నారట. ‘కోడిపుంజు పౌడర్’గా వ్యవహరించే ఏవేవో మత్తు పదార్థాలతో కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారట. లాక్ డౌన్ పరిస్థితుల్లో చీప్ లిక్కర్ క్వాలిటీ క్వార్టర్ బాటిల్ దొరకని పేదలు పిచ్చాసుపత్రి పాలవుతున్నారనే వార్తలను కాసేపు పక్కన బెడదాం.

ఫొటోల్లో కనిపిస్తున్న ఖరీదైన మద్యం బ్రాండ్లను చూడండి. ‘అమృత్ అల్గమ్’ ఇండియాలోనే హై ప్రీమియమ్ క్వాలిటీ బ్రాండ్ మాల్ట్ విస్కీ. ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో గల లిక్కర్ బాటిల్ ఇది. రోజుకు అయిదు వేల బాటిళ్లు మాత్రమే తయారవుతాయట. అందుకే ఈ బ్రాండ్ అంటే మద్యపాన ప్రియులు నాలుక చప్పరిస్తుంటారు. మనదేశంలో కర్నాటక, గోవా రాష్ట్రాల్లో మాత్రమే ‘అమృత్ అల్గమ్’ విక్రయాలకు అనుమతి ఉందట. మిగతా రాష్ట్రాల్లో కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేదట. ఇక ఖరీదు ప్రస్తావనకు వస్తే కనిష్టంగా రూ. 4 వేల నుంచి గరిష్టంగా రూ. 64 వేల వరకు ఆన్ లైన్లో కనిపిస్తోంది.

అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ లేబుల్, దేవాస్ వైట్ లేబుల్, రెడ్ లేబుల్, బ్లాక్ డాగ్, 100 పైపర్స్… అబ్బో పేర్లు వింటేనే మద్యపాన ప్రియుల లాలాజలం నోటి నుంచి జాలువారే బ్రాండ్లు మరి. వీటిలో 100 పైపర్స్ మినహా మిగతా బ్రాండ్లన్నీ ఖరీదైనవే. కాస్త అటూ ఇటుగా ప్రతి బాటిల్ రేటు కనీసంగా రూ. 3,000 వరకు ఉండొచ్చు. తయారైన తేదీ, దాని వయస్సు (8 ఇయర్స్, 12 ఇయర్స్)ను బట్టి రేట్లలో హెచ్చు తగ్గులు ఉంటాయి. లాక్ డౌన్ వేళ నోరూరించే లిక్కర్ బ్రాండ్ల గోలేంటని అప్పుడే నిరాశపడకండి. ఇక అసలు విషయంలోకి వస్తే…

ఆయా బ్రాండ్లకు చెందిన 43 లిక్కర్ ఫుల్ బాటిళ్లు ఖమ్మం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ కారులో తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు వార్తలు. ఈ ఘటనలో కారు డ్రైవర్ ను అబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకున్నారట. వాస్తవానికి 100 పైపర్స్ వంటి బ్రాండ్లు మినహా బ్లాక్ డాగ్, అమృత్ అల్గమ్, వైట్ లేబుల్ వంటి ఖరీదైన బ్రాండ్లను స్థానికంగా వైన్ షాపు యజమానులు లిక్కర్ డిపో నుంచి లిఫ్ట్ చేయరట. ఎందుకంటే వాటి విక్రయంకన్నా కొన్ని విభాగాలకు ఫ్రీ సర్వీస్ ధాటికి భయపడి వాటి జోలికే వెళ్లరట.

అందులోనూ లాక్ డౌన్ పరిస్థితి. ఈ నేపథ్యంలో సదరు రెస్టారెంట్ యజమాని ‘అమృత్ అల్గమ్’ వంటి ఖరీదైన బ్రాండ్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు? ఎవరైనా వీఐపీలకు సరఫరా చేస్తున్నాడా? అందులో రాజకీయ నేతలెవరైనా లబ్ధిదారులు ఉన్నారా? మరెవరైనా ప్రజాప్రతినిధులకు ‘గిఫ్టు’గా ఇస్తున్నాడా? లాక్ డౌన్ నేపథ్యంలో కర్నాటక, గోవా నుంచి లిక్కర్ స్మగ్లింగ్ యధేచ్ఛగా ఖమ్మం వరకు సాగుతోందా? ఇటువంటి వ్యక్తుల వెనుక ఏదేని పొలిటికల్ పవర్ ఉందా? వంటి ప్రశ్నలు మాత్రం సంధించకండి. ఎందుకంటే ఆయా సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులదే. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే చీప్ లిక్కర్ దొరక్క పేదోడు పిచ్చాసుపత్రి పాలు… పెద్దోళ్లకు మాత్రం ఇది ‘అమృత’ బంధపు కాలం. ఈ బంధం విడదీయరానిది కూడా. అదీ సంగతి.

Comments are closed.

Exit mobile version