ఔను… ఆఫ్ఘనిస్థాన్ లో వందలాది మంది జడ్జిలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ దేశంలోని తాజా పరిణామాలవల్ల ప్రాణభయంతో వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు పలువురిపై దాష్టీకానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. మహిళలు, జర్నలిస్టులు తదితరులను తీవ్రంగా హింసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు హక్కుల కోసం నిరసన తెలుపుతున్నవారిని సైతం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్థాన్ లోని దాదాపు 200 మంది మహిళా జడ్జిలు సైతం అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షలతో ఖైదీలుగా ఉన్న నేరస్థులను, తీవ్రవాదులను, తాలిబన్లను విడుదల చేస్తున్నారు. దీంతో వీరికి శిక్షలు వేసిన అనేక మంది జడ్జిలకు ప్రాణ భయం పట్టుకుంది. తాలిబన్లు చంపేస్తారనే ఆందోళనతో వందలాది మంది జడ్జిలు అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఇందులో సుమారు 200 మంది మహిళా జడ్జిలు కూడా ఉన్నట్లు బ్రిటన్ కు చెందిన ‘ది ఇండిపెండెంట్’ తన రిపోర్టులో వెల్లడించింది.
ఓ వైపు తాలిబన్ల నుంచి, మరోవైపు శిక్షలు పడ్డ నేరస్థుల నుంచి ఆప్ఘన్ దేశంలోని జడ్జిలకు ప్రాణభయం ఏర్పడింది. భార్యను హింసించాడనే నేరారోపణ రుజువు కావడంతో దాదాపు ఎనిమిది నెలల క్రితం ఓ తాలిబన్ కు 38 ఏళ్ల మహిళా జడ్జి ఒకరు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలయ్యాక జడ్జిని కూడా అదేవిధంగా హింసిస్తానని ఆయా తాలిబన్ తీర్పు సమయంలోనే బెదిరించాడు.
అయితే అప్పట్లో తాను ఈ బెదిరింపును సీరియస్ గా తీసుకోలేదని, కానీ ప్రస్తుతం అతను జైలు నుంచి విడుదలయ్యాక తన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మహిళా జడ్జి వాపోయారు. నగర్ హర్ ప్రావిన్స్ కు చెందిన సదరు మహిళా న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.
గతంలో అనేక మంది నేరస్థులకు శిక్షలు విధించిన జడ్జిల పరిస్థితి కూడా దాదాపుగా ఇదే విధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. జైళ్ల నుంచి విడుదలైన తాలిబన్ల, నేరస్థుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రస్తుతం వందలాది మంది ఆఫ్ఘన్ జడ్జిలు అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం.