‘బాయిల పడ్డోని మీద బండెడు రాళ్లు’… తెలంగాణాలో పాపులర్ సామెత ఇది. ఇప్పుడీ నానుడి ప్రస్తావన దేనికంటే… పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల ఘటనలో సరిగ్గా ఇదే జరుగుతోందా? ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత వామన్ రావు బాధితులమంటూ కొందరు వ్యక్తులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఈనెల 17న జరిగిన వామన్ రావు దంపతుల హత్యోదంతంపై న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విధులు బహిష్కరించారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. న్యాయాన్ని బతికించాలని నినదించారు. రాష్ట్ర హైకోర్టు కూడా అడ్వకేట్ దంపతుల హత్యను గర్హించింది. సుమోటోగా స్వీకరించింది. ఈ దారుణ హత్యోదంతం ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేదిగా ఉందని, ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ న్యాయవాదుల నుంచి వస్తున్నది. మొత్తంగా వామన్ రావు దంపతుల హత్య రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారానికి కారణమైందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

ఈ కేసులో పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతోపాటు కుంట శ్రీను సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అడ్వకేట్ల దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు సాగుతున్న క్రమంలోనే ఇంకా అనేక కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ దారుణానికి కేంద్రబిందువుగా ఆరోపణలు గల ‘పుట్ట’లో ఇంకా ఎవరైనా దాగి ఉన్నారా? అనే ప్రశ్నలు ప్రామాణికంగా పోలీసుల దర్యాప్తు సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నెన్నో ప్రశ్నలు… మరెన్నో సంశయాలు. ఈ నేపథ్యంలోనే వామన్ రావు దంపతుల హత్యోదంతంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై కుట్రపూరిత దుష్ప్రచారం చేస్తున్నారని పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శనివారం వివరణ ఇచ్చుకున్నారు. మీడియాలోని కొందరు అమ్ముడుపోయి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు. తాను ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తప్పుడు ప్రచారం చేయడంలో దిట్టగా అభివర్ణిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ తనకు అపాయింట్ మెంటు ఇవ్వలేదని మీడియా ప్రచారం చేస్తోందని, తాను అసలు హైదరాబాద్ కూడా వెళ్లలేదని, అడ్వకేట్ దంపతుల హత్య కేసులో తన ప్రమేయం ఉంటే అరెస్టు చేయవచ్చని కూడా పుట్ట మధు స్పష్టం చేస్తున్నారు.

వామన్ రావు దంపతుల దారుణ హత్యోదంతం రాజకీయ ప్రకంపనలు కలిగిస్తున్న పరిస్థితుల్లోనే శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. వామన్ రావును ‘చాక్ పీసుల దొంగగా అభివర్ణిస్తూ, అనేక అరాచకాలు చేశారని ఆరోపిస్తూ కొందరు తెరపైకి రావడం గమనార్హం. తాను వామన్ రావు క్లాస్ మేట్ నని, చిన్నతనంలోనే చాక్ పీసుల దొంగతనం నుంచి అతని జీవితం ప్రారంభమైందని, క్రిమినల్ యాక్టివిటీస్ చిరుప్రాయంలోనే అలవాటు చేసుకున్నాడని బండి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. నకిలీ నక్సలైట్ల పేరును వాడుకుని డబ్బు వసూల్ చేశాడని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడని, వామన్ రావుతోగాని, అతని కార్యకలాపాలతోగాని తనకు సంబంధం లేదని అతని తండ్రి పత్రికా ప్రకటన ఇచ్చాడని బండి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మరో విలేకరుల సమావేశంలో అరుణజ్యోతి అనే మహిళ, ఆమె కుటుంబీకులు వామన్ రావుపై పలు ఆరోపణలు చేశారు. ‘పుండా కోర్…కిడ్నాప్ లు చేశాడు. మహిళలను చెరబట్టిండు. అట్లాంటిదానికి చంపేయాలని…’ అని మహిళ వ్యాఖ్యానించడం గమనార్హం. అడ్వకేట్ ముసుగులో అనేక దందాలు చేశాడని, అనేక కేసులు కూడా ఉన్నాయని, అతని మంచి వ్యక్తి కాదని, బాధితులు బయటకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

మొత్తంగా వామన్ రావు దంపతులు హత్యోదంతంపై తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతుండడం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు, కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ నేపథ్యంలో తాాజా పరిణామాలు చర్చకు దారి తీశాయి. వామన్ రావు దంపతుల హత్య జరిగిన నాలుగో రోజున కొందరు వ్యక్తులు తెరపైకి రావడం, అనేక ఆరోపణలు చేయడం వంటి సీన్లు చెబుతున్నదేమిటి? ఇదీ అసలు సందేహం. ఓ న్యాయవాదిగా వామన్ రావు దాఖలు చేసిన కేసుల్లో న్యాయముందా? అన్యాయముందా? అనే విషయాన్ని తేల్చాల్సింది న్యాయస్థానాలు మాత్రమే. కానీ హత్యకు గురైన వ్యక్తుల వ్యక్తిత్వహనన ప్రయత్నానికి తాజా ఘటనలు ఓ సంకేతమా? ఇందులోనూ రాజకీయ ప్రేరేపిత అంశాలు ఏవేని దాగి ఉన్నాయా? అదే నిజమతై హత్యకు గురైన వ్యక్తులపై ఆరోపణల రాళ్లు విసరడమే అసలు పరిష్కారమా? వామన్ రావు దంపతులకు లభిస్తున్న సానుభూతిని తగ్గించే విఫలయత్నమా? దర్యాప్తును పక్కదోవ పట్టించే విఫలయత్నమా? ఇవీ న్యాయవాద వర్గాల్లో వ్యక్తమవుతున్న సందేహాలు.

Comments are closed.

Exit mobile version