ఆయన కుటుంబానికి అక్షారాల దాదాపు 32 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయ్. ఎకరాలకొద్దీ భూములున్నాయ్. కేవలం స్థిరాస్తులే కాదు… కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయ్. ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ నుంచి ప్రయివేట్ యూనివర్సిటీ అధినేతగా ఎదిగిన సక్సెస్ ఫుల్ విద్యావేత్తగా ప్రాచుర్యమూ ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నేపథ్యమూ ఉంది. కానీ ఆయన పేరు మీద సొంత ‘కారు’ లేదు. ఇన్నేసి అస్తులున్న విద్యావేత్త కమ్ రాజకీయ నాయకుడి పేరు మీద ఓ చిన్నపాటి ‘కారు’ కూడా లేకపోవడం విశేషమే కదా! వాస్తవానికి ఈ రోజుల్లో కారు ఉండడం అసాధారణమేమీ కాకపోవచ్చు… కానీ పేరెన్నిక గల ఓ రాజకీయ నాయకుడి పేరు మీద కనీసం కారు లేకపోవడమే ఆసక్తికర పరిణామం.

ఔను… వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు మీద కారు కూడా లేదట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడమే అసలు విశేషం. తన పేరు మీద కారైతే లేదని ‘పల్లా’ ప్రకటించారుగాని, ఆస్తులను మాత్రం దాచుకోకుండా పూసగుచ్చినట్లు వెల్లడించారు. తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 31.70 కోట్లుగా ప్రకటిస్తూ, అందులో రూ. 18.54 కోట్ల స్థిర, రూ. 13.15 కోట్ల చరాస్తులుగా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. తన పేరుపై సొంత కారు లేకపోయినా, తన భార్య పేరు మీద 2017 మోడల్ మారుతీ సెలీరియా కారు మాత్రం ఉందన్నారు. అంతేకాదు రూ. 4.10 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాలతోపాటు 32.10 ఎకరాలు తన పేరుమీదు, మరో 10.27 ఎకరాలు తన భార్య పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద 41.39 ఎకరాల భూములున్నట్లు వివరించారు. ఇవిగాక హైదరాబాద్ లోని శివం రోడ్ లో ఆస్థితోపాటు వరంగల్ లో పిల్లల పేర్లపై, మరికొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి ఆస్తులుగా నివాస భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రికార్డెడ్ గా ఇన్ని ఆస్తులున్న ‘పల్లా’ పేరుపై సొంత కారు లేకపోవడమే రాజకీయంగా చర్చనీయాంశమైంది.

కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారో తెలుసా? ప్రయివేట్ కాలేజీ యజమానిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రయివేట్ యూనివర్సిటీ స్థాయికి పెరిగాడని అంటున్నారు. ప్రయివేట్ రంగంలో చిన్న కాలేజీ యజమానిగా ఉన్న పల్లా మంత్రి కేటీఆర్ కు చెంచాగిరి చేస్తూ, గడచిన ఆరేళ్లలో ప్రయివేట్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగారని, రూ. వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్ తరపున డబ్బుల మూటలు తెస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Comments are closed.

Exit mobile version