సరికొత్త రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు ప్రగతి భవన్ లో ‘దళిత బంధు’ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం వుండే ఇతర రంగాలను కూడా గుర్తించాలని, వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

అదేవిధంగా పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు వేసే వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ళ పెంపకం, టెంట్ హౌజ్, డెయిరీ పరిశ్రమ, ఆయిల్ మిల్లు, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల పరిశ్రమ, హోటల్, స్టీల్ సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, సెల్ ఫోన్ షాప్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నీచర్ షాప్ వంటి పలురకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి , దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

‘తెలంగాణ దళితబంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు.. ఇదొక ఉద్యమం. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి వుంటది. అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలి. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ వుంటాయి. మనం నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడే విజయం సాధిస్తాం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించింది. మనిషిపై తోటి మనిషే వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీ ద్వారా నేను కూడా అధ్యయనం చేశాను. మనలో కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోవాలె. పరస్పర విశ్వాసం పెరగాలె. ఒకరికొకరం సహకరించుకోవాలె. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను పోలీస్ స్టేషన్లలో వాపస్ తీసుకోవాలె. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలె. అప్పుడే మన విజయానికి బాటలు పడుతాయి. దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరం అవుతారు. నేటి సదస్సులో పాల్గొన్న వాళ్లంతా, హుజూరాబాద్ లో విజయం సాధించి, ముందురోజుల్లో, తెలంగాణవ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలె. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే దళిత జాతి అభివృద్ధి జరుగుతది. దాంతోపాటే తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కూడా దారులు వేస్తది. నైపుణ్యం, ప్రతిభ వున్న దళిత వర్గాన్ని, అంటరానితనం పేరుతో ఊరవతల వుంచి, ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం కూడా దుర్మార్గం. ఇది తెలివి తక్కువ పనే.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రగతి భవన్ లో దళిత ప్రతినిధుల సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

‘పులికి ఉండేంత శక్తి మనలో నిబిడీకృతమై వున్నది. ఆ శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. విజయం సాధించాలంటే దళారులు, ప్రతీప శక్తులను దూరం ఉంచాలి. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. బాధిత కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకున్నది. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుంది. సర్కారే స్వయంగా అండగా వున్నప్పుడు.. విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. ప్రభుత్వ వర్గాలతో పనితీసుకునే క్రమంలో ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలి. దళితబంధు పథకం పటిష్ట అమలుకు మమేకమై పనిచేయాలి’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Comments are closed.

Exit mobile version