భూకబ్జాలు, సెటిల్మెంట్లు తదితర అంశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖమ్మం నగరంలో కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వచ్చిన ఓ స్థల వివాదంలో ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ లీడరే ఆందోళన వ్యక్తం చేస్తుండడం విశేషం. తొలుత వీడియోను చూడండి.

చూశారుగా…? వీడియోలో మాట్లాడుతున్న టీఆర్ఎస్ లీడర్ పేరు చావా నారాయణరావు. ఖమ్మంలో మున్సిపల్ కార్పొరేటర్ చావా మాధురి భర్త. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు నారాయణరావు కూడా కార్పొరేటరే. రిజర్వేషన్ల కారణంగా ఈసారి తన సతీమణిని ఏకగ్రీవంగా కార్పొరేటర్ గా గెలిపించుకున్నారు. నిజాన్ని నిష్టూరంగా చెప్పాలంటే చావా నారాయణరావు ప్రస్తుతం డిఫాక్టో కార్పొరేటర్ అన్నమాట.

ఇంతకీ నారాయణరావు ఏమంటున్నారంటే… తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తికి చెందిన భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. తన డివిజన్ వాళ్లకే న్యాయం జరగనపుడు తాను ఖమ్మం పట్టణ ప్రజలకు ఏం చేయగలనని వాపోతున్నారు. భూకబ్జా వ్యవహారంపై ఎమ్మార్వోను, ఆర్డీవోను, కలెక్టర్ ను కలిశానంటున్నారు. కబ్జాకు గురైన భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వబోనని ప్రతిన పూనుతున్నారు.

అవతలివాళ్లు చుట్టాలను, బంధువులను పెట్టుకుని ఎంతగా ప్రయత్నించినా అన్యాక్రాంతం కానివ్వనని, అవసరమైతే ప్రాణం పోయినా కూడా ఈ స్థలంలోనూ కూర్చుంటామంటున్నారు. న్యాయం జరిగే వరకు నిద్రపోనని, అవసరమైతే మంత్రి వద్దకు, టీఆర్ఎస్ ఆఫీసుకు, కేటీఆర్, కేసీఆర్ వద్దకు కూడా వెడతానని, అవసరమైతై పార్టీకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. రూ. 5.00 కోట్ల విలువైన 1,140 గజాల ప్రాపర్టీగా చెబుతూ, బాధితుడు జీవితం మొత్తం కష్టపడినా వస్తుందా? అని అంటున్నారు. ఈరోజు ఎంత మంది పేదలు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తూ, వాళ్లకోసం పోరాడుతానని, అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెడతానని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త చావా నారాయణరావు భూకబ్జా వివాదంపై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులెవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా తమ స్థలాన్నే ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఇదే స్థల వివాదంలో భద్రాచలానికి చెందిన రావులపల్లి రవికుమార్ ఆరోపించారు. ఈ భూవివాదంతో సంబంధం లేని చావా నారాయణరావు తమను బెదిరిస్తున్నాడని, దౌర్జన్యానికి పాల్పడి తన భూమిని ఆక్రమించాలని చూశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వివాదానికి సంబంధించి ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version