ఖమ్మంలో కబ్జాల పుట్ట పగులుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమ భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంలో గులాబీ పార్టీకి చెందిన కొందరు నేతలు గుటకాయ స్వాహా చేసిన సర్కారు భూముల బాగోతం బట్టబయలవుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సున్నిత హెచ్చరికతోనే అనేక కబ్జా, అక్రమ దందాలు బహిర్గమవుతుండగా, ఆయన మరికాస్త కన్నెర్ర జేస్తే ఇంకెన్ని భూదందాలు వెల్లడవుతతాయోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడొకరి అండదండలతో కొందరు బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం నగరంలో భారీ ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు భూకబ్జాలనే ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు. కబ్జాలు లేని ప్రశాంత ఖమ్మం నగరం కోసం తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ఫలితం ఎలా వచ్చిందో, ప్రజలు ఎలా స్పందించారో తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఖమ్మం నగరంలో సాగిన అక్రమ భూ దందాలకు జీవో నెం. 58, 59లు కూడా ప్రామాణికంగా నిలవడం గమనార్హం. ఈ జీవోలను ఆసరాగా చేసుకునే పలువురు బీఆర్ఎస్ నేతలు కోట్ల విలువైన సర్కారు భూములను చేజిక్కించుకున్నట్లు అధికారుల విచారణలోనే బహిర్గతమవుతున్నాయి.

బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు భార్య, ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్,  శ్రీవిద్య 415 గజాల ప్రభుత్వ స్థలానికి దరఖాస్తు చేసి అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కార్పొరేటర్ అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిన అధికారులు చట్ట ప్రకారం కేసు కూడా నమోదు చేశారు.

ఈ నేపథ్యంలోనే మరిన్ని అక్రమ దందాలను అధికారులు వెలికి తీశారు. ఖమ్మం అర్బన్ పరిధిలో ఖానాపురం సర్వే నెం. 272 లో 300 గజాల ప్లాట్, ఖానాపురం డొంకలో 200 గజాల రెండు ప్లాట్లు, 150 గజాల ఒక ప్లాట్, వెలుగుమట్ల సర్వే నెం. 412లో 300 గజాల  ప్లాట్ స్థలాలలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా పలువురు జీవో 59 క్రింద దరఖాస్తు చేశారని సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదివారం వెల్లడించారు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించామని, సుమారు రూ. 4.35 కోట్ల విలువైన పై స్థలాలను  రెవెన్యూ, మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని  ఫెన్సింగ్  ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా  భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా సిసి కెమెరా లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, మునిసిపల్ సిబ్బంది నిఘా పెట్టి,  ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, నిర్మాణాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇదెలా ఉండగా తాజాగా 1.10 ఎకరాలు.. అంటే సుమారు 6,050 చదరపు గజాల ప్రభుత్వ స్థలం కూడా ఆక్రమణకు గురైనట్లు అధికారులు తాజాగా గుర్తించారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఈ భారీ అక్రమాన్ని అధికారులు కనుగొన్నారు. సోమవారం వీటి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అయితే తాజాగా వెలుగు చూస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్లలో, కబ్జా బాగోతాల్లో నిందితుల పేర్లను రహస్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత కోసం ఇటువంటి అక్రమాలకు పాల్పడినవారి పేర్లను కూడా వెల్లడించాలనే డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. లేని పక్షంలో అధికారుల వ్యవహార శైలిని కూడా సందేహించాల్సి వస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువంటి అక్రమ దందాల్లో వెలుగు చూస్తున్న భూబాగోతాల్లో వాటి విలువను అధికారులు ప్రభుత్వ ధర ప్రకారమే వెల్లడిస్తున్నారు. బహిరంగ మార్కెట్ రేటును బట్టి కబ్జాల, అక్రమ దందాల్లో భూముల విలువ ఎంత భారీ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం నగరంలో ఎక్కడైనా సరే కనీస చదరపు గజం స్థలం రూ. 30 వేలు కాగా, ప్రైమ్ లొకాలిటీల్లో గరిష్టంగా లక్షన్నర పలుకుతోంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతల అక్రమ భూ దందాల బాగోతపు మొత్తాన్నిఅంచనా వేయవచ్చు.

Comments are closed.

Exit mobile version