మిత్రులారా.! కామ్రేడ్స్..!!

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం పోరాడి ఓడిపోవడం పట్ల చాలా మంది ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఆయనను మనసా వాచా బలపరిచి ప్రచారం చేసిన వారికి భాద కలిగిస్తున్నది. ఇది సహజమైనది. పట్టభద్రుల తీర్పు తెలంగాణా సమాజానికి మరింత గౌరవం, అభిమానం ఇస్తుందని భావించిన వారి హృదయాలను గాయపరచడం సహజమే.

తెలంగాణా సమాజంలో హక్కుల ఉద్యమం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం దాకా, ఆ తర్వాత నిరుద్యోగుల సమస్య నుంచి ధర్నా చౌక్ దాకా ప్రతి ఆందోళనలో భాగంగా ఆయన ఉన్నారు. తెలంగాణా సమాజానికి ఆయనొక మేధావి. విలువలు, ప్రజా బంధం, నిజాయితీ కలిగిన వారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీల మీద కంటే, కోదండరాంనే టార్గెట్ చేస్తూ నిర్భంధం పెట్టారు. ఆయనను బాగా పలచన చేయాలని చూశారు. అయినా ధైర్యంగా నిలబడ్డారు.

ఓకే, ఎన్నికలు ఒక తతంగం. గెలుపు ఓటములు సహజం. ఓటమిని ఓర్పుతో, నేర్పుతో తీసుకుందాం. ఎన్ని కుట్రల మధ్య, ఎన్ని ప్రలోభాల మధ్య జరిగిన ఈ ఎన్నికల పోరాటంలో పాల్గొన్నాం. క్యాస్ట్, క్యాష్, పవర్, దొంగ ఓట్లు, కొన్ని ఉద్యోగ సంఘాల దొంగాటకం, కొన్ని రాజకీయ పార్టీలు పరోక్ష పద్ధతిలో అధికార టిఆర్ఎస్ కు సహకారం అందించడం, కొందరు కుల సంఘాల నాయకులు శత్రువులను వదిలేసి, కోదండరాంపై చేసిన దాడి, ఇవన్నీ మన ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఈ క్రమములో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు వేసిన పన్నాగంకై అధికార పార్టీ ప్లాన్ కి వర్క్ అవుట్ అయింది. డబ్బు లేకుండా నిజాయితీగా పోరాడిన కోదండరాం నైతికంగా గెలిచారు. టెక్నికల్ గా అధికార పార్టీ అభ్యర్థికి మెజారిటీ ఉన్నా నైతికంగా సింగిల్ ఓటుతో మేజిక్ ఫిగర్ కి రాక లక్ష దగ్గరే ఆగడం నైతిక ఓటమే. మొత్తంగా ప్రభుత్వ ఓట్లే అధికం.

‘గుడ్డిలో మెల్ల’లాగా వీధి విమర్శల వెల్లువలో, మరికొందరి సహకారంతో రెండవ స్థానంలో రావడం చెమటలు పట్టించిన పరిస్థితి నేటి తెలంగాణ సమాజ రేపటి దారికి దిక్సూచి.

ఇక కమ్యూనిస్టులు, సామాజిక వాదులు, డెమోక్రాట్లు ప్రజల నాడిని, వాడిని గమనించి తగిన విధంగా ఎత్తుగడలు రూపొందించుకోవాలి. రోజుకొక పోరాటాలతో అలిసిపోయి సంతృప్తి పడటం కంటే ప్రజల విశ్వసనీయత పొందాలి.

నెల రోజుల పాటు ఇంకా అంతకంటే ఎక్కువగా కోదండరాం కోసం తీవ్రంగా, నిజాయితీగా కష్టపడి పనిచేసిన వారందరికీ అభినందనలు. కుంగుబాటు, కంగుబాటు వద్దు. భవిష్యత్తుపై విశ్వాసం ఉంచాలి. ప్రతి ఓటమి గర్భములో విజయాన్ని వీక్షిద్దాం.

✍ పి. రంగారావు ( PR )
రాష్ట్ర సహాయ కార్యదర్శి,
CPI ML న్యూడెమోక్రసీ
తెలంగాణా రాష్ట్రం

Comments are closed.

Exit mobile version