పోస్టర్ బెదిరింపుల వివాదంపై ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శనివారం సాయంత్రం కీలక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబును హత్య చేస్తామంటూ పోస్టర్లు వెలిసినట్లు మీడియా, సామజిక మాధ్యమాలలో వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మువ్వా విజయ్ బాబును చంపుతామంటూ పోస్టర్లు వెలిసినట్లు మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలకు, వార్తలకు ఎలాంటి ప్రాధమిక అధారాలు పోలీసుల విచారణలో లభించలేదన్నారు. అదేవిధంగా ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గతంలో ఎప్పుడూ మువ్వా విజయ్ బాబుకు ప్రాణహాని ఉన్నట్లు అతనుగాని, అతని తరపున గాని ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు జిల్లాలో లేవన్నారు. అదేవిధంగా ప్రస్తుతం పోలీస్ శాఖలో వున్న (Threat perception) ముప్పు జాబితాలో కూడా మువ్వా విజయ్ బాబు పేరు లేదని స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఊహాజనితమైన తప్పుడు కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పటిస్తూ ప్రశాంతంగా వున్న జిల్లాలో అలజడి సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలిస్ కమిషనర్ హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కాగా పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటనను యధాతథంగా దిగువన చూడవచ్చు..