ఖమ్మం నగరంలో నిర్మిస్తున్న ఆధునిక బస్ స్టేషన్ కు గులాబీ కలర్ రేకులు అమరుస్తుండడం వివాదానికి దారి తీస్తోంది. నగరంలోని బైపాస్ రోడ్డులో నిర్మిస్తున్న ఈ బస్ స్టేషన్ ప్రారంభం ఎప్పుడనే విషయంపై క్లారిటీ లేకపోయినా, వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త బస్ స్టేషన్ నుంచే బస్సులు తిరుగుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు పాత బస్ స్టేషన్ లో ప్రయాణీకులకు విషయాన్ని సూచిస్తూ ప్రకటన బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే కొత్త బస్ స్టేషన్ కలర్, పాత బస్ స్టేషన్ వినియోగంపై వివిధ రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నగరంలో రూ. 25.00 కోట్ల వ్యయంతో 7.30 ఎకరాల విస్తీర్ణంలో, 32 ప్లాట్ ఫారాలతో, అధునాతన వసతులతో బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. ప్లాన్ ప్రకారం పూర్తి స్థాయిలో నిర్మాణపు పనులు పూర్తి కాకపోయినప్పటికీ, వీలైనంత త్వరగా బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను ప్రారంభించాలని మంత్రి భావిస్తున్నారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ బస్ స్టేషన్ ను ప్రారంభించాలని మంత్రి అభిలషించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కావచ్చు, మరే ఇతరత్రా కారణాలో తెలియదుగాని వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త బస్ స్టేషన్ నుంచే బస్సులు తిప్పాలని నిర్ణయించారు.

అయితే కొత్త బస్ స్టేషన్ రూఫ్ భాగంలో ‘గులాబీ’ కలర్ రేకులను అమరుస్తుండడంపై వివిధ రాజకీయ పక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్న బస్ స్టేషన్ కు అధికార పార్టీ జెండా రంగును పోలిన రేకులను అమర్చడమేంటని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కోట్ల విలువైన ఖమ్మం పాత బస్టాండుపై పెద్దల కన్ను పడిందని, పాత బస్ స్టేషన్ ను సిటీ బస్ స్టేషన్ గా కొనసాగించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త బస్ స్టేషన్ ను హైటెక్ గా, పాత బస్ స్టేషన్ ను సిటీ బస్ స్టాండ్ గా కొనసాగుతుందని మంత్రి అజయ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ప్రస్తుతం మాట మారుస్తున్నారని అఖిల పక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

నగరం చుట్టుపక్కల గల ప్రజలు హాస్పిటల్ కోసం, వివిధ రకాల పనుల కోసం రోజూ వేలాది మంది వచ్చి వెళ్లతారని, పాత బస్ స్టేషన్ లేకుంటే విద్యార్థులు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పాత బస్టాండ్ ను స్థానిక బస్టాండ్ గా కొనసాగించాలని , కొత్త బస్టాండ్ ను ఎక్స్ ప్రెస్ బస్టాండ్ గా వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత బస్ స్టేషన్ ను ఆసరా చేసుకొని అనేక మంది చిరు వ్యాపారులు, ప్లాట్ ఫారమ్ వ్యాపారులు, తోపుడు బండ్లవాళ్లు తదతర వర్గాలు బతుకుతున్నాయని, ఈ కేంద్రం వ్యాపార సముదాయంగా, నగరానికి గుండెకాయగా ఉందన్నారు. పాత బస్టాండ్ మూసివేత చర్యలు నిజమే అయితే ప్రజల తరపున పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు.

Comments are closed.

Exit mobile version