కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుంది? డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఈ టికెట్ కోసం హోరా హోరీగా ప్రయత్నిస్తున్న పరిణామాలు రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఎవరికి దక్కనుందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నప్పటికీ, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తుండడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర స్థాయిలో దాదాపు ముగిసినట్లుగానే వార్తలు వస్తున్నాయి. ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ తాజాగా పంపింది. మరో వారంలోనే అభ్యర్థుల ఎంపిక పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతకీ ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి..?

నిజానికి ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి టికెట్ ప్రయత్నంలో కొద్దిరోజుల క్రితం వరకు కూడా ముందంజలో ఉన్నారు. ఏఐసీసీలో గతంలో ఆమెకు గల పట్టుపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అత్యంత వ్యూహాత్మకంగా రేణుకను టికెట్ బరి నుంచి తప్పించారనే అభిప్రాయాలు ఉన్నాయి. అనూహ్యంగా ఆమెకు రాజ్యసభ టికెట్ దక్కడం, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాకచక్యంగా పావులు కదిపారనే ప్రచారం ఉంది. తన సోదరుని టికెట్ విషయంలో గట్టి పోటీ లేకుండా చేసుకునే ప్రక్రియలో భాగంగా రేణుకను రాజ్యసభకు పంపడంలో పొంగులేటి తెరవెనుక తనదైన శైలిలో మంత్రాంగం నెరిపారంటున్నారు. దీంతొ పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డికి టికెట్ విషయంలో లైన్ క్లియరైనట్లు పార్టీ శ్రేణులు అంచనా వేశాయి.

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, వీవీసీ రాజేంద్రప్రసాద్ తదితరులు కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ ఏఐసీసీ పెద్దలనే కాకుండా, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి నాయకులను కూడా వరుసగా కలుస్తుండడం వెనుక ఎంపీ టికెట్ ప్రయత్నాలుగానే పార్టీ కేడర్ చెబుతోంది. ఇంకోవైపు సీనియర్ నేత వి. హన్మంతరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ లు కూడా ఖమ్మం సీటుపై కన్నేశారు. తమకు ఇక్కడ పోటీ చేసే హక్కు ఉందంటున్నారు.

ఈ పరిణామాల్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణా నుంచి పోటీ చేయాల్సిందిగా పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మన రాష్ట్రం నుంచి పోటీకి రాహుల్ గాంధీ అంగీకరిస్తే ఖమ్మం, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీకి సుముఖతను వ్యక్తం చేస్తే ఆశావహులందరూ టికెట్ పై ఆశలు వదులుకోవలసిందే. ఒక వేళ నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి రాహుల్ గాంధీ పోటీకి అంగీకరిస్తే టికెట్ ఎవరికి లభిస్తుందనేదే అసలు చర్చ.

కర్నాకట డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తుమ్మల యుగంధర్ కలిసిన చిత్రం

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. రాహుల్ గాంధీ పోటీ చేయకుంటే ఖమ్మం టికెట్ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం సఫలమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరెడ్డి ఖాయంగా ఆ పార్టీ శ్రేణులే అంచనా వేస్తున్నాయి. ఇందుకు గల బలమైన కారణాలను కూడా పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లు, ఉమ్మడి వరంగల్ లోని నాలుగు సెగ్మెంట్లతో కూడా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు మంత్రి పొంగులేటి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అర్థబలం, అంగబలం పుష్కలంగా గల పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంట్ సీట్లలో అభ్యర్థుల గెలుపు బాధ్యత ఉందంటున్నారు. ఈ మూడు స్థానాల గెలుపు బాధ్యతను పొంగులేటికే పార్టీ అప్పగించిందనే ప్రచారం కూడా ఉంది. ఇటువంటి అనేక అంశాలు ప్రామాణికంగా రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకుంటే పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన లాంఛనప్రాయం మాత్రమేనని పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి. మొత్తంగా రాహుల్ గాంధీ నిర్ణయంపైనే ప్రసాదరెడ్డి రాజకీయ భవితవ్యం ఆధారపడినట్లు కనిపిస్తోంది.

Comments are closed.

Exit mobile version