• 9 ఏళ్లుగా సాకారం కాని తెలంగాణ ప్రజల కలలు
  • ఇంకా 15 ఏళ్లకైనా ఉమ్మడి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతారా…
  • ప్రజా కోర్టులో మూల్యం చెల్లించక తప్పదు
  • సమయం సందర్భం వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు శీనన్న గూటికి వస్తారు
  • 15 నెలలు గడిచినా పరిష్కారం కాని ధరణి సమస్యలు
  • వైరా ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శ

“రాష్ట్రంలో కేవలం కేసీఆర్ నామస్మరణ జపం చేయాలనే తపన… ఆరాటం తప్ప అధికార పార్టీకి మరో ధ్యాస లేదు… తెలంగాణ సాధించిన తొమ్మిది ఏళ్లలో ప్రజల కలలు సాకారం కాలేదు… 15 నెలలు గడుస్తున్నా ధరణి వెబ్సైట్ లో నెలకొన్న వందల సంఖ్యలో సమస్యలను పరిష్కరించాలనే ధ్యాస ప్రభుత్వానికి లేదు… కరోనా కష్టకాలం వల్ల రైతుల రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులతో ఒక సచివాలయం ఉండగానే మరో సచివాలయాన్ని గొప్పల కోసం నిర్మిస్తోంది… విద్యా వైద్యం సాగునీటి రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది… ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో నిజాలను నిజంగా ఒప్పుకోవటం లేదు” అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వైరాలో బుధవారం పొంగులేటి అభిమానుల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో పొంగులేటి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ప్రజల కలలు సాకారం కాలేదని విమర్శించారు. అధికారంలో ఉన్న నాయకులు ఈ విషయంపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్ నామస్మరణ జపం చేయాలనే తపన తప్ప ప్రజల సమస్యలపై పాలకులకు కనీస దృష్టి లేదన్నారు. ధరణి వెబ్సైట్లో గత 15 నెలలుగా నెలకొన్న వందల సంఖ్యలోని సమస్యలను నేటి వరకు పరిష్కరించలేదన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 10 శాతమైన ఆయా వర్గాలకు ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు, నాలుగు లక్షల కోట్లు అని గొప్పలు చెప్పుకోవటానికి తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరోనా కారణం వల్ల రుణమాఫీ చేయలేకపోయామని చెబుతున్న పాలకులు గొప్పలు కోసం ఒక సచివాలయం ఉన్నా మరో సచివాలయాన్ని వందల కోట్లతో నిర్మిస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానమైన రోల్లపాడు ప్రాజెక్టు కోసం 2016 ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 19 వేల కోట్ల రూపాయలు కాగా గడిచిన ఏడేళ్లలో నాబార్డ్ నుంచి 6000 కోట్ల రూపాయలు తెచ్చి పనులు చేశారని వివరించారు. ఈ లెక్కల ప్రకారం రాబోయే 15 సంవత్సరాల కైనా రోల్లపాడు నిర్మించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు గోదావరి జలాలతో కడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు.

తనకు కల్లూరు మండలంలో 40 ఎకరాల మామిడి తోట ఉందని, ఆ తోటకి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని విమర్శలు చేసే నాయకులకు కౌంటర్ ఇచ్చారు. తన ఆస్తులపై జనవరి రెండో తేదీన రెవెన్యూ అధికారులతో విచారణ చేయించిన అధికార పక్షానికి తనకి ఎంత పొలం ఉందో తెలియదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వానికి గత నెల రోజులుగా విద్యుత్ సరఫరా లేక రైతులు పడుతున్న ఆవేదన తెలియదా? అని ప్రశ్నించారు. విద్యుత్ కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ సమస్య గురించి తెలిసినా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యంతో నిజాలను నిజంగా ఒప్పుకోవట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అందుతుందో పాలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గొప్పల కోసం నామస్మరణ కోసం పాకులాడుతున్న పాలకులు తప్పదని హెచ్చరించారు.

వైరా నియోజకవర్గంతో తనకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే వైరా నియోజకవర్గ ప్రజలు తనకు మరింత అండదండలుగా ఉన్నారన్నారు. వైరా నియోజకవర్గంలోని వందలాది మంది ప్రజా ప్రతిప్రనిధులు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా శీనన్న గూటికి చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు తాను భరోసా ఇచ్చానని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి విజయభాయి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటుందని శీనన్న చెల్లెలిగా ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బానోత్ విజయభాయి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పొంగులేటి అనుచరులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Comments are closed.

Exit mobile version