అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు రెవెన్యూ శాఖకు చెందిన ఓ తహశీల్దార్ చిక్కారు. భూయజమాని ఒకరి నుంచి భారీ మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహశీల్దార్ సునీతను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెడితే…
కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని సర్వే నెం. 3లో హరికృష్ణ అనే వ్యక్తికి 4.25 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. తన భూమికి కొత్త పాసు బుక్ ఇవ్వాలని హరికృష్ణ తహశీల్దార్ సునీతను ఆశ్రయించారు. అయితే రూ. 3.00 లక్షలు ఇస్తేనే పాస్ పుస్తకం మంజూరు చేస్తామని తహశీల్దార్ పేర్కొనగా, తొలుత ఆమెకు హరికృష్ణ రూ. 50 వేలు ఇచ్చారు. మిగతా మొత్తం కూడా ఇస్తేనే పాస్ బుక్ ఇస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ నుంచి తహశీల్దార్ సునీత రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.