మూడు బీర్లు… ఓ క్వార్టర్… ఆ పక్కనే ఓ స్ప్రైట్ బాటిల్… మరో వాటర్ బాటిల్ కూడా. ఎక్కడో చిట్టడవిలో కూర్చున్నట్లు కనిపిస్తున్న ఈ నలుగురు కుర్రోళ్లు హాయిగా మందేస్తూ, ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నట్లుంది కదూ సీన్! బీర్లు ఖాళీ అయినట్టున్నాయ్ గాని, క్వార్టరే ఇంకాస్త మిగిలి ఉన్నట్లుంది. కానీ ఈలోగా బిలబిలమంటూ పోలీసులు రానే వచ్చారు. తాగింది చాలుగాని, పదండి… పదండి అంటూ లాఠీ ఝుళిపించారు. బహిరంగ ప్రదేశాల్లో ‘మందు’ తాగుతున్నారంటూ అదుపులోకి తీసుకున్నారు. బారు జోలికి వెళ్లకుండా, ఊరికి దూరంగా, ఎక్కడో చిట్టడవిలాంటి ప్రదేశంలో మందు కొడుతుంటే ఈ పోలీసులకు ఎలా తెలిసిందబ్బా అని మందుబాబులకు మత్తు దిగి ఆశ్చర్యపోయారట.

ఇంతకీ అసలు సంగతేంటంటే… డ్రోన్ కెమెరా వీళ్ల తాగుడు బాగోతాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న తమను ఎవరూ చూడడం లేదని వీళ్లు భావించినట్లున్నారు. కానీ డ్రోన్ కెమెరా వీళ్ల ‘సీన్’ను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీసులకు చేరవేసింది. వేర్వేరు ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలా మందు కొడుతున్న మొత్తం 14 మందిని కొత్తపల్లి పోలీసులకు డ్రోన్ కెమెరా పట్టించింది. అందుకే పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కుదరదు అంటున్నారట కరీంనగర్ పోలీసులు. డ్రోన్ కెమెరా చూస్తోంది… బీ కేర్ ఫుల్ అంటున్నారట. మీరు చూస్తున్న ఈ ఫొటో డ్రోన్ కెమెరా తీసిన దృశ్యమే. అదీ సంగతి.

Comments are closed.

Exit mobile version