ఒక్కోసారి అభిమానుల చర్యలు నాయకులకు ఇబ్బందికరంగా తయారవుతుంటాయి. ఇక వీరాభిమానుల చర్యలైతే సదరు నాయకుల ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగానూ ఉంటాయి. విమర్శకుల నోటికి, చేతికి పని కూడా కల్పిస్తుంటాయి. తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దాదాపు ఏడాది తర్వాత రాజకీయంగా మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించే రోజు రానే వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన కవిత గురించి ఆమె అభిమానులు తీరని వేదనను అనుభవిస్తున్నారు. ‘రావాలి కవితక్క’ అంటూ గత కొంత కాలంగా అభిలషిస్తూనే ఉన్నారు.

అభిమానుల కోరిక తీరే రోజు రానే వచ్చింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ సార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత బుధవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి గల బలాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు కవిత గెలుపు నల్లేరుపై నడకే. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎమ్మెల్సీగా గెలిచాక ఆమెకు కేసీఆర్ కేబినెట్లో స్థానం కూడా దక్కవచ్చు. అవకాశం, పరిస్థితులను బట్టి కవిత హోం శాఖ మంత్రి అయినా కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పొరుగున గల ఏపీలో ఓ మహిళ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా పని చేశారు.

ఈ నేపథ్యంలో కవిత హో మంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చనేది ఆమె అభిమానుల అంచనా కూడా. కానీ సదరు అభిమానుల్లో వీరాభిమానులైన కొందరి ప్రచారపు చేష్టలే కవిత రాజకీయ ప్రయాణంలో ఇబ్బందికర పరిణామాలుగా చర్చకు దారి తీస్తున్నాయి. ఎలాగంటే… ఇదిగో ఇలాగన్న మాట. ‘ఢిల్లీలో గర్జించనున్న గొంతు’ అంటూ కవిత అభిమానులు పోస్ట్ చేసిన ‘ఇమేజ్’ ఒకటి అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులకు పని కల్పించింది. ‘ఎమ్మెల్సీ ఢిల్లీలో గర్జించుడు ఏందిర అయ్యా? ఫిల్ల ఫింకీలు కూడా ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చేశారన్న మాట’ అంటూ సోషల్ మీడియా వేదికగానే రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు.

Comments are closed.

Exit mobile version