ఇండోనేషియా నుంచి ఇటీవల కరీంనగర్ కు వచ్చిన కొందరు ప్రయాణీకుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇండోనేషియాకు చెందిన కొందరు విదేశీయులకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలిసిందని, రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సాక్షాత్తూ తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లను, పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను ఆహ్వానించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ కు చెందిన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన కొంతమంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను గురువారం నాటి సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. విదేశాల నుండి వచ్చిన వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోను విదేశాల నుండి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలని, స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.

విదేశాల నుండి వచ్చిన ఎవరినైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తరువాతనే ఇండ్లకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వుండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జరిగే అత్యవసర, అత్యున్నత సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం వుంది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమి గూడే కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా వుండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, జనం ఒకే చోట గుమిగూడవద్దని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

కాగా కరీంనగర్ నగరానికి చెందిన ప్రజలెవరూ బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం ఐదు గంటల వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పేరున ఓ ప్రకటన జారీ అయింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి మందును పిచికారీ చేస్తున్నామని, ఈ సమాచారాన్ని స్నేహితులకు, బంధువులకు తెలపాలని కూాడా ఆయన కోరారు. ఆయా వాట్సాప్ మెసేజ్ ను దిగువన చూడవచ్చు కూడా.

Message from Municipal Commissioner
“Hello i kindly request you not to come out of your house after 10 pm tonight till tomorrow 5 am…. As their will be spraying medicine in the air in order to kill the COVID-19!!
Share this information to all your friends,relatives and your families…
Thank you!”

Comments are closed.

Exit mobile version