ఝార్ఖండ్ రాష్ట్రంలో సిట్టింగ్ జడ్జి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ధన్ బాద్ జిల్లా అదనపు కోర్టు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. వాస్తవానికి ఈ సంఘటనను పోలీసులు మొదట్లో ప్రమాదంగా భావించారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా జడ్జిని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ బుధవారం తెల్లవారుజామున జాగింగ్ కు వెళ్లారు. సమయం ఏడు గంటలు కావస్తున్నా ఆనంద్ తన నివాసానికి తిరిగి రాకపోవంతో ఆయన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించగా గాయపడిన జస్టిస్ ఆనంద్ ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించారని తెలిసింది. గుర్తు తెలియని వాహనం ఏదో ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా హత్యోదంతం వెలుగు చూసింది. ఈ హత్యపై ధన్ బాద్ బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుమోటోగా పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించాలని అభ్యర్థించింది.
కాగా జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ ధన్ బాద్ లో అనేక మాఫియా హత్య కేసులను విచారించారు. ఇటీవలే ఇద్దరు గ్యాంగ్ స్టర్లకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన దారుణ హత్యకు గురి కావడం న్యాయవాద వర్గాల్లో తీవ్ర కలవరానికి దారి తీసింది. జస్టిస్ ఆనంద్ ను ఆటోతో ఢీకొట్టిన వీడియోను దిగువన చూడవచ్చు.