ప్రపంచ స్థాయి జర్నలిస్టుకు బతుకు దెరువు గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లు లేదు. అందుకే కాబోలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు జర్నలిస్టు అంటే ఎలా ఉండాలండీ? సమాజ హితాన్ని కోరుకుంటూ, ఎక్కడైనా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? వీళ్లేమైనా షోయుబుల్లా ఖాన్ వారసులనుకుంటున్నారా ఏమిటి? జర్నలిస్టంటే అచ్చంగా కొందరు తెలుగు జర్నలిస్టుల్లా ఉండాలి. అది ఎలాగంటే…?

బతుకుమ్మ వార్తలను కాపీ కొట్టడం నుంచి జర్నలిస్టుగా బతుకును ప్రారంభించాలి. అంటే గత సంవత్సరం సహచర జర్నలిస్టు రాసిన బతుకమ్మ వార్తను అందరికన్నా ముందుగా తిప్పి రాసి డెస్కుకు పంపాలి. అవసరమైతే డెస్కును బతిలాడి ఓ బైలేన్ కూడా పెట్టించుకోవాలి. ఏదో ఒక హింసాత్మక ఘటనలో నలుగురితో పాటు నారాయణ తరహాలో ఓ కర్ర తీసుకుని అవతలి వ్యక్తిని బాదాలి. ఆ తర్వాత దెబ్బలు తిన్నవాడు చనిపోతే, పోలీసులు కేసు నమోదు చేస్తే పత్తా లేకుండా పారిపోవాలి. కొన్నాళ్లపాటు చీకటి జీవితం గడపాలి. ఆ తర్వాత ఏదో ఒక సంస్థ కాళ్లా, వేళ్లా పడి రాష్ట్ర రాజధాని వరకు పాకాలి. అక్కడ ఉద్యోగం ఊడే ప్రమాదాన్ని ముందే పసిగట్టి, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యజమానిని పట్టుకోవాలి. పాత సంస్థను ఉద్ధరించినట్లు ప్రగల్బాలు పలకాలి. కొత్త యజమానిని బుట్టలో వేసుకుని కాస్త పెద్ద పోస్టు పట్టాలి. ఆ తర్వాత కింది స్థాయి జర్నలిస్టుల ఉసురు పోసుకోవాలి. మిడిల్ మేనేజ్మెంట్ చెవులు కొరకాలి. సంప్రదాయం, ఆచారం, మడి వంటి అనేక కుటుంబ పద్ధతులను కాశీలో వదిలేసి పీకలదాకా మందు కొట్టడం నేర్చుకోవాలి. వీలైతే కాకినాడ, యానాం ప్రాంతాల్లో పనిచేసే రిపోర్టర్లను బెదిరించి విదేశీ మద్యాన్ని తెప్పించుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే కిందిస్థాయి విలేకరులను బెదిరింపులకు గురి చేస్తూనే లిక్కర్ ను అడుక్కోవాలి.  గోదావరి జిల్లాల రిపోర్టర్లను దేబిరించి ‘పులస’ చేపలను రుచి చూడాలి. అబ్బో అద్భుతమంటూ రాతపూర్వకంగా తన సారూప్యతగల వారితో పంచుకోవాలి. ఇంకా వీలైతే గల్లీ రాతల జీవితాన్ని ‘గల్లా’ రాతలుగా మార్చుకోవాలి. గుంటూరు జిల్లాలో భూములు అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, అక్షరం ముక్కరాని వ్యక్తిని అందలం ఎక్కించాలి. వీలైతే తెలంగాణాలోని ఓ జిల్లాకు ఇంచార్జిగా నియమించాలి. అడ్డగోలుగా కరెన్సీ నోట్లను గుట్టలుగా పేర్చుకోవాలి. విషయం తెలుసుకుని ఆలస్యంగా మేల్కొన్న యాజమాన్యం మెడలు పట్టి గెంటేస్తే అక్కడా, ఇక్కడా తిరిగి… ఎక్కడా పట్టుమని మూడు నెలలుగా కూడా ఉద్యోగం చేయలేక కొత్తగా ఓ దుకాణం తెరిచి ఫ్రస్ట్రేషన్-కమ్-పర్వర్టెడ్ జర్నలిజానికి అలవాటుపడాలి. తెల్లారిందే తడవుగా దొరికినవారిని దొరికినట్టు తిడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ జర్నలిజానికి ఆద్యుడినంటూ తన అచ్చటా, ముచ్చటా తీర్చుకోవాలి. జర్నలిజానికి తాను మాత్రమే అసలు పితామహుడినంటూ హితోక్తులు పలకాలి. వీలైతే రామోజీరావు వంటి వారికి కూడా పత్రిక ఎలా నడపాలో తన దుకాణం ద్వారా సలహాలిస్తూ ఉండాలి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కే కాదు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జగన్ కూ పాలన ఎలా చేయాలో ప్రవచించాలి. తానొక్కడినే ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తే ఎవరూ పట్టించుకోరనే విషయాన్ని గ్రహించి దారినపోయే కొన్ని మురికి కాల్వలను కూడా తన ఫ్రస్ట్రేషన్-కమ్-పర్వర్టెడ్ జర్నలిజపు ప్రవాహంలో కలుపుకోవాలి. ఆ మురికి కాల్వల మధుర సువాసనలను ఆస్వాదిస్తూ, జర్నలిజంలో ఇదే అసలు వైభోగమంటూ ప్రవచిస్తూ ఉండాలి. ఇంకాస్త చతురతతో అప్పుడప్పుడు ముసుగు రైటర్లను ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇవేవీ చేతగాని కొందరు జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి బాధలు పడుతున్నారో తెలుసా? రిపోర్టర్స్ విత్ఔట్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ సర్వే నివేదిక పేరుతో ఓ జర్నలిస్టు మిత్రుడు ఉదయాన్నే వాట్సాప్ పోస్ట్ పంపారు. మీరూ ఓసారి చదవండి.

‘‘జర్నలిస్ట్’ ఉద్యోగం ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనదని రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా సంస్థ సర్వేలో తేలింది. ఈ వృత్తి చేపట్టిన చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. దాదాపు అన్ని రకాల ఉద్యోగాలపై పరిశోధనలు నిర్వహించగా, జర్నలిస్టుల గురించి అనేక ఆసక్తికరమైన నిజాలు వెల్లడైనట్టు రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ సంస్థ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం 57 మంది జర్నలిస్టులు బందీలుగా ఉంటే, 389 మంది జైళ్లల్లో మగ్గుతున్నారని సంస్థ తెలిపింది. పారిస్‌లో రెండు దశాబ్దాల్లో సగటున 80 మంది జర్నలిస్టులు మృత్యువాత పడినట్టు తన అధ్యయనంలో వెల్లడైనట్లు చెప్పింది. ప్రస్తుత సంవత్సరం 2019లో ప్రపంచ వ్యాప్తంగా 49 మంది పాత్రికేయులు హత్యకు గురైనట్లు, మరికొంత మంది పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టర్స్ విత్‌‌ఔట్ బోర్డర్స్ సంస్థ వెల్లడించింది. అతి ప్రమాదకరమైన వృత్తుల్లో పాత్రికేయుల వృత్తి ఒకటని, అనేక మంది జర్నలిస్టులు వార్తల సేకరణలో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సిరియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, యెమెన్‌లో జరుగుతోన్న విధ్వంసకర పరిస్థితులపై వార్తలను సేకరించేందుకు వెళ్తున్న జర్నలిస్టుల్లో చాలా మంది తిరిగి రావడం లేదంటూ రిపోర్టర్స్ విత్‌ఔట్ సంస్థ తెలిపింది. వార్తలను సేకరించే అనేక సందర్భాల్లో జర్నలిస్టులు బెదిరింపులకు, అవమానాలకు, ప్రమాదాలకు గురవుతున్నట్లు సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.’’

అర్థమైంది కదా? ప్రపంచ స్థాయిలో అసలైన జర్నలిస్టుల బతుకు చిత్రం. అందుకే కొందరు ఫ్రస్ట్రేషన్ కమ్ పర్వర్టెడ్ జర్నలిస్టుల గురించి ఈ అసలు వార్తకు ముందు ఉపోద్ఘాతంగా చెప్పాల్సి వచ్చింది. సందర్భాన్నిబట్టి, అవసరాన్నిబట్టి ఇటువంటి ఫ్రస్ట్రేషన్-కమ్-పర్వర్టెట్ జర్నలిజం గురించి మరోసారి చెప్పుకుందాం. ఇంకా చాాలా సంగతులున్నాయిగాని, ఇప్పటికిది చాలు.

Comments are closed.

Exit mobile version