జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విడుదల చేసిన కార్టూన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని సీఎం నడుస్తున్న కార్టూన్ ను ట్విటర్లో పవన్ పోస్టు చేస్తూ, సీఎం జగన్ గురించి ఢిల్లీలో ఇటువంటి అభిప్రాయమే ఉందంటూ కామెంట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో గల పవన్ ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డిపై పలు విమర్శలు కూడా చేశారు. మొత్తం 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 151 స్థానాల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, కానీ… కేవలం 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి జగన్ పాలనలో దెబ్బతిందని ఆరోపించారు. రాష్ట్రంలో 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత కూడా ఆ పార్టీకి దక్కిందని వ్యాఖ్యానించారు. పవన్ ఢిల్లీ పర్యటనపై భిన్న కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకే తమ నాయకుడు ఢిల్లీ బాట పట్టారని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకే పవన్ దేశ రాజధానికి వెళ్లారని మరికొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి.