ప్రపంచంలోనే నంబర్ వన్ న్యూస్ ఏజెన్సీ… (ఇది మేం చెప్పడం లేదు. మొన్న ఓ టీవీ జర్నలిస్టు నిర్వచించారు) రాయిటర్స్ గట్టిగానే చెంపలేసుకుంది. కియా మోటార్స్ అంశంలో తప్పు జరిగిందంటూ స్వయంగా వివరణ ఇచ్చుకుంది. తప్పుడు సమాచారం వల్లే ‘కియా మోటార్స్ తరలింపు’ వార్త ప్రసారమైనట్లు అంగీకరించింది. కియా మోటార్స్ తరలిపోతోందని గతంలో చేసిన ట్వీట్ ను డిలీట్ చేస్తున్నట్లు మరో ట్వీట్ లో వెల్లడించింది.
తప్పును అంగీకరించడం పత్రికా ప్రమాణాల్లో ఆహ్వానించదగిన పరిణామమే. కానీ ప్రపంచంలోనే నంబర్ వన్ న్యూస్ ఏజెన్సీ ఇలా తప్పులు చేస్తే, ఆ వార్త దావానలంలా వ్యాపిస్తే, అదే వార్తను తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొన్ని మీడియా సంస్థలు బ్యానర్ స్టోరీగా ప్రచురిస్తే… జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇదీ అసలు ప్రశ్న. అందుకే… ఏమి‘రా’యిటర్స్…? ఏమి నీవల్ల ‘కియా’ మోటార్స్ కు ఉపయోగం అని సంభోదించక తప్పలేదు. అంతపెద్ద ప్రపంచ నంబర్ వన్ న్యూస్ ఏజెన్సీ తప్పును అంగీకరించాక ఇంతకన్నా ఎక్కువగా రాయడం కూడా జర్నలిస్టిక్ లక్షణం కాదు. అందుకే ఇది ఇక్కడితో సమాప్తం. ఇక కాగల కార్యం వైఎస్ జగన్ తీర్చు గాక.