నినదించడం వేరు… నినాదాన్ని చేసి చూపడం వేరు. ‘ప్రతి అడుగు ప్రజల కోసం… మీ భద్రతే మాకు ముఖ్యం’ అంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ నినాదాన్ని నిజం చేశాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు, నెటిజన్ల నుంచి విశేషంగా ప్రశంసలను అందుకుంటోంది.
హైదరాబాద్ మోజంజాహి మార్కెట్-కోటి మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. భారీ ట్రాఫిక్ మధ్య ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో గల వ్యక్తి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ అంబులెన్స్ కదిలే పరిస్థితి కనిపించడం లేదు. అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే బాబ్జీ అనే కానిస్టేబుల్ పరిస్థితిని గమనించారు. అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేస్తూ దారి కల్పించారు.
ఫలితంగా అంబులెన్స్ సకాలానికి ఆసుపత్రికి చేరుకుంది. అందులో గల వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంతకీ బాబ్జీ ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పద్ధతేమిటీ అంటారా…? దిగువన గల వీడియోను చూడండి. మీరూ అతని తపనకు చప్పట్లు కొట్టాల్సిందే.