ఆర్నబ్ గోస్వామి… మీడియా ప్రపంచంలో పెద్దగా పరిచయం అక్కరలేని జాతీయ స్థాయి జర్నలిస్టు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్ చీఫ్. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ అనే వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పారనే అభియోగంపై ఐపీసీ 306 సెక్షన్ కింద నిన్న ముంబయి, రాయగఢ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును కేంద్ర హోమంత్రి అమిత్ షా సహా కేంద్రంలోని అనేక మంది పెద్దలు ఖండించారనేది వేరే విషయం. కానీ ఆర్నబ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన సందర్భంగా అతని నివాసంలో చోటు చేసుకున్న దృశ్యాలు అత్యంత ఆసక్తికరంగా ఉండడమే అసలు చర్చ.
ఆర్నబ్ అంటే ఎవరు? సాదా సీదా జర్నలిస్టు కాదు మరి. డిబేట్ల నిర్వహణ సందర్భంగా ఎంతటి కాకలు తీరిన నేతల నోరునైనా మూయించగల వాగ్ధాటి గల జర్నలిస్టు. తన అరుపుల గోలతో జర్నలిజానికి సరికొత్త నడక నేర్పిన సుప్రసిద్ధ జర్నలిస్టు. తన అరుపులను భరించడానికి మాత్రమే తన డిబేట్లకు రావాలని చెప్పకనే చెప్పే పాత్రికేయుడు. మన తెలుగు మీడియాలోనూ అరుపుల ఆర్నబ్ వారసులు కొందరున్నారండోయ్. అటువంటి అర్నబ్ గోస్వామి తనకోసం పోలీసులు వచ్చిన సందర్భంగా వ్యవహరించిన తీరు, చేసిన రచ్చ సైతం చర్చనీయాంశమే. ఆర్నబ్ అరెస్ట్ సందర్భంగా తీసిన ఓ వీడియో ఇదే అంశాన్ని బోధపరుస్తోంది.
తనకోసం పోలీసులు తలుపు తడితే, ఆ తలుపు గడియ తీయడానికి దాదాపు గంట సమయం పట్టిందట. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు అంతసేపూ అర్నబ్ కోసం తలుపు ముంగిటే వేచి ఉన్నారట. గంట తర్వాత ఆర్నబ్ ఇంటి తలుపులు తెరుచుకున్నప్పటికీ, పోలీసులను లోనికి వెళ్లనీయకుండా తలుపులు మూసేందుకు ప్రయత్నించారుట. ఎట్టకేలకు లోనికి ప్రవేశించిన పోలీసులను ఉద్దేశించి ఓ మహిళ వెంటనే వీడియో తీయడం ప్రారంభించారు. బహుషా ఆమె ఆర్నబ్ సతీమణి కావచ్చు. తమకు సహకరించాలని పోలీసులు పదే పదే అభ్యర్థించారు. ఎఫ్ఐఆర్ నెంబర్, అందులోని సెక్షన్లను ప్రస్తావిస్తూ అరెస్ట్ చేయడానికి వచ్చామని పోలీసులు స్పష్టంగానే చెప్పారు.
ఈ సందర్భంగా ఆర్నబ్ తనదైన శైలిలోనే స్పందించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘నన్ను ఓ సోఫా నుంచి మరో సోఫాలోకి దౌర్జన్యకరంగా మార్చారు. భౌతికంగా గాయపర్చారు. నేను ఏర్పాట్లు చేసుకోవాలి’ అని ఆర్నబ్ అరుస్తూనే ఉన్నాడు. ఓ మహిళా పోలీస్ డాక్యుమెంటుపై సంతకం చేయాలని మరో మహిళ (ఆర్నబ్ భార్య కాబోలు)ను కోరగా, ఎటువంటి సంతకం చేయవద్దని ఆర్నబ్ ఇంకోవైపు అరుస్తున్నాడు. తన పేరెంట్స్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలంటున్నాడు. ప్రతి సీన్ కూడా లైవ్ అవుతోందని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాడు. తనను భౌతికంగా ఇబ్బంది పెట్టారని, అసౌకర్యంగా ఉందన్నాడు.’ ఇదీ తన అరెస్ట్ సందర్భంగా ఆర్బన్ గోస్వామి చేసిన హంగామా సారాంశం.
తన డిబేట్లలో అత్యంత దేశభక్తిని ప్రదర్శించే ఆర్నబ్ గోస్వామి తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన సందర్భంగా ఇలా ఎందుకు ప్రవర్తించాడనేది ఓ సందేహం. వాస్తవానికి చట్టం గురించి ఆర్నబ్ గోస్వామికి తెలియదనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. అంతర్జాతీయ అంశాలపై కూడా అలవోకగా డిబేట్లు నిర్వహించే ఆర్బన్ గోస్వామికి ఐపీసీలోని 306 సెక్షన్ గురించి తెలియకుండా ఉంటుందా? న్యాయకోవిదుల అభిప్రాయం ప్రకారం… ఇటువంటి కేసులు క్లోజ్ చేయడం ఉండదు. ఎల్ఫీసీ (లాంగ్ పెండింగ్ కేసు)లుగా ఓ మూలన పడేస్తుంటారు అంతే. కేసును క్లోజ్ చేసే అధికారం కోర్టుకు మాత్రమే ఉంటుంది. అన్వయ్ నాయక్ ఆత్మహత్యోదంతంలో అర్నబ్ గోస్వామిపై నమోదైన కేసు స్థితి కూడా దాదాపు ఇదే కావచ్చనేది న్యాయకోవిదుల అభిప్రాయం.
![ts29 arnab arrest](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/11/arnab-arrest.jpg?resize=770%2C433&ssl=1)
ఈ కేసులో ఇటువంటి కీలకాంశాన్ని మిస్సయిన అర్నబ్ గోస్వామి తన అరెస్ట్ సందర్భంగా ఎందుకలా వ్యవహరించారు.. అంటే? విషయాన్ని ‘రచ్చ’చేసేందుకేనట. పోలీసులు తనకోసం వచ్చి, అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించగానే, ఆర్బబ్ వంటి సుప్రసిద్ధ జర్నలిస్టు ‘ నేను చట్టాన్ని గౌరవిస్తున్నాను, పదండి’ అంటూ పోలీసుల వెంట నడిస్తే హుందాగా ఉండేదట. అత్యంత పలుకుబడి గల ఆర్నబ్ ఆ తర్వాత ప్రక్రియలో చట్టపరంగా పోరాడవచ్చు. కానీ అలా చేస్తే ఆయన ఆర్నబ్ గో స్వామి ఎలా అవుతాడు? ఈ సీన్ లో కొసమెరుపు ఏమిటంటే… తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసుపై ఆర్నబ్ చేయి చేసుకున్నారనే అభియోగంపై ఇంకో కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. మహిళా పోలీసు ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్బన్ పై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. బహుషా ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఉంటారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగానికి ఈ సెక్షన్ వర్తిస్తుంది.
కాబట్టి ఆర్నబ్ రచ్చ వల్ల చేకూరిన అదనపు ప్రయోజనం మరో కేసు అన్నమాట. అన్వయ్ నాయక్ కేసులో బెయిల్ తెచ్చుకుంటే ఐపీసీ 353 సెక్షన్ కింద మళ్లీ అరెస్ట్ చేసే ప్రమాదం పొంచి ఉందన్నమాట. డిబేట్ల ద్వారా అందరినీ భయపెట్టే ఆర్నబ్ గోస్వామిని ఇక్కడ చట్టం భయపెట్టిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అదీ అసలు విశేషం.