పత్రిక నిర్వహణ కష్టసాధ్యంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ తరహా సవాలక్ష కష్టాలు ‘ప్రింట్’ అవుతున్న పత్రికలకు మాత్రమే. కానీ పెద్దగా ప్రింటింగ్ లేని డిజిటల్ పత్రికల నిర్వహణ ఖర్చు ప్రింటవుతున్న పత్రికల కష్టంతో పోల్చితే సముద్రంలో కాకిరెట్ట తరహాలో అభివర్ణించక తప్పదు. డిజిటల్ పత్రికకు ఖర్చులు ఉండవా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కావడంలో అతిశయోక్తి లేదు. కానీ ఉద్యోగుల జీతభత్యాలు మాత్రమే డిజిటల్ పత్రికల్లో ప్రధానం. న్యూస్ ప్రింట్, తదితర ఖర్చులు డిజిటల్ పత్రికలకు ఏ మాత్రం ఉండదు.

మలయాళ మనోరమ అనే పత్రిక కేరళలో ఉంది. ప్రాంతీయ పత్రికల సర్క్యులేషన్ లో దేశంలోనే ఇది టాప్ గా ఏబీసీ లెక్కలు ఉన్నాయి. మలయాళ మనోరమను బీట్ చేసేందుకు అనేక అగ్రశ్రేణి ప్రాంతీయ పత్రికలు దశాబ్ధాలుగా విఫలయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ పత్రికకు జర్నలిజం పరంగా వార్తల అంశంలోనే కాదు… వ్యాపారంతో కూడిన ప్రకటనలు (యాడ్స్) విషయంలోనూ కొన్ని స్వీయ నిబంధనలు ఉన్నట్లు చెబుతుంటారు.

ఉదాహరణకు ఓ స్కూల్ యాజమాన్యం తమకు టీచర్లు కావాలని ‘వాంటెడ్’ ప్రకటనను మలయాళ మనోరమ పత్రికకు ఇచ్చిందనుకోండి. డబ్బులు వస్తున్నాయి కదా… అనే ఆపేక్షతో వచ్చిన ప్రకటనను వెంటనే ప్రచురించదు. ఆ స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు ఉందా? అనే బేసిక్ ప్రశ్నను సంధిస్తుంది. ఉన్నట్లు డీఈవో సర్టిఫికెట్ చూపాలని షరతు విధిస్తుంది. ఎందుకంటే గుర్తింపు లేని స్కూలు ప్రకటనను ప్రచురిస్తే, తమ ప్రకటనకు ప్రభావితమై ఎవరైనా ఆ స్కూల్ లో చేరితే, వారికి జీతభత్యాలు వంటి అంశాల్లో అన్యాయం జరిగితే… ప్రకటనను ప్రచురించిన తాము కూడా బాధ్యులమనే నైతిక అంశాన్ని విస్మరించరాదనే సూత్రాన్ని మలయాళ మనోరమ పత్రిక పాటిస్తుందట. ఇప్పుడీ అంశాలను ప్రస్తావించడం దేనికంటే….? దిగువన గల ఓ ‘యాపార’ విశేషాంశాన్ని నిశితంగా పరిశీలిస్తే విషయం బోధపడుతుంది.

మన తెలుగు డిజిటల్ మీడియాలో ‘దిశ’ అనే ఓ పత్రిక ఉంది తెలుసుగా…? ఈ పత్రిక వ్యాపారపరంగా అనుసరిస్తున్న విధానాలు, పోకడలు సహజంగానే ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ మధ్య ఓ ప్రయివేట్ చిట్ ఫండ్ కంపెనీపై బీభత్సమైన రెండు వార్తా కథనాలను ఈ పత్రిక ప్రచురించింది. వార్తా కథనాల్లో సత్యాసత్యాల సంగతి అప్రస్తుతం… కానీ, ఆయా చిట్ ఫండ్ కంపెనీ గురించి ఈ పత్రిక రాసిన కంటెంట్ ఏమిటో తెలుసా?

ఈ చిట్ ఫండ్ కంపెనీలో చీటీలు వేసిన ఖాతాదారుల సొమ్ము దారి మళ్లుతోందని, కస్టమర్ల సొమ్ముతో సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తొలుత గత నెల 25వ తేదీన ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి వచ్చిన స్పందన ఏమిటో తెలియదుగాని, ఆ తర్వాత మరో కథనాన్ని ప్రచురించింది. ఈ చిట్ ఫండ్ లో చిట్టీ కడితే అంతే… సంగతులని గత నెల 28వ తేదీన మరో కథనంలో తేల్చేసింది. ఆయా చిట్ ఫండ్ కంపెనీ పేరు విన్నోళ్లు ఏదో పెద్ద చిట్ కంపెనీ అనుకుంటారని, కానీ ఇదో ‘మాయా సంస్థ’ అని నిర్వచించింది. సదరు చిట్ ఫండ్ కంపెనీ మోసాలను తాము వరుస కథనాలు ప్రచురిస్తుంటే బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని కూడా కీర్తించుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. చీటీలు వేసే ప్రజల ప్రయోజనార్థం ఆయా కథనాలు రాసిందనే కాసేపు అనుకుందాం. కానీ దిగువన గల వ్యాపార ప్రకటనను ఓసారి చూడండి.

చూశారుగా…? ఆయా చిట్ ఫండ్ కంపెనీని మాయా కంపెనీగా అభివర్ణించిన ‘దిశ’ పత్రిక అదే చిట్ ఫండ్ కంపెనీకి చెందిన ఫుల్ పేజీ ప్రకటనను ‘జాకెట్’ యాడ్ గా ప్రచురించడం గమనార్హం. ఈ చిట్ ఫండ్ కంపెనీని ‘మాయా కంపెనీ’గా అభివర్ణించిన పత్రికే సదరు కంపెనీ ప్రకటనను ప్రచురించడం పత్రిక ‘యాపారం’లో భాగమే కావచ్చు. కానీ గత నెలలో రెండు వార్తా కథనాలు ప్రచురించిన వారం రోజుల తర్వాతే దాదాపు రూ. 3.00 లక్షల విలువైన ఫుల్ పేజీ ‘యాపార’ ప్రకటనను ప్రచురించడమే అసలు విశేషం. ప్రచురించిన వార్తలను జర్నలిజంగా, ఫుల్ పేజీ యాడ్ ను ‘యాపారం’గా పత్రిక నిర్వాహకులు, యాజమాన్యం సమర్థించుకోవచ్చు… కానీ,

‘కమ్యూనిస్టు’ నేపథ్యం ఉన్నట్లు ప్రాచుర్యంలో గల పత్రిక యాజమాన్యం, మావోయిజపు పోరాట చరిత్ర ఉన్నట్లు వాడుకలో గల దాని ఎడిటర్ మార్కండేయ సారథ్యంలో వెలువడుతున్న పత్రిక యాపారపు ‘దిశ’ మారడమే చర్చనీయాంశంగా మారింది. వ్యాపార ప్రకటనల ప్రచురితంలో మలయాళ మనోరమ పత్రిక ‘ఎథిక్స్’ను ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో బోధపడినట్టేగా…!? ‘దిశ’ పత్రిక ‘యాపార’ ప్రకటనకు ఆకర్షితులై, ఆ పత్రిక కథనం ప్రకారమే ఈ ‘మాయా సంస్థ’లో చేరిన ప్రజలు మోసపోతే బాధ్యులెవరన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

– ఎడమ సమ్మిరెడ్డి

Comments are closed.

Exit mobile version