అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా డిసెంబర్ 2014లో ప్రకటించినప్పుడు, 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు పూర్తిగా వ్యతిరేకించారు. ఇక్కడ భూములు ఉండి వాటిని కౌలుకిచ్చిన యజమానులు (రైతులు అనలేం) తప్ప మిగతా వర్గాల వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించేవారు పోరాటం చేసే అవకాశం కూడా పాలకులు ఇవ్వలేదు. నిరసన ప్రదర్శనలకు తావే లేదు. అలా అప్పటి పాలకులు ఈ వ్యతిరేకతలను పట్టించుకోలేదు. NGT లో కేసులు కూడా పట్టించుకోలేదు. పాలకులు తాము అనుకున్న ప్రకారం ఇక్కడే రాజధాని అని ప్రకటించారు.
ఇప్పుడు పాలకులు మారారు. నిర్ణయాలు మారుతున్నాయి. రాజధానిని మూడు భాగాలుగా విడగొట్టారు. ఈ నిర్ణయంపై కూడా విమర్శలు, వ్యతిరేకత వస్తున్నాయి. కోర్టు కేసుల వరకూ వెళ్ళింది. నిరసన ప్రదర్శనలపై లాఠీలు విరుగుతున్నాయి. వ్యతిరేకతను పట్టించుకోవడం లేదు.
కేంద్రం కూడా చేతులెత్తేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ప్రకటించేసింది. ఇక ఉద్యమాలతో ఉపయోగం లేదు. నిరసనలతో పని జరగదు. అనవరసరంగా లాఠీ దెబ్బలు తినడం మినహా చేయగలిగింది లేదు.
పాలకులను మాత్రమే మార్చగలం, వారి నిర్ణయాలు కాదు. ఆ అవకాశం కోసం ఎదురు చూడడం తప్ప చేయగలిగిందేముంది!?
అయినా విభజన చట్టం 2014 సవరణ అయ్యేవరకూ హైదరాబాదే మన రాజధాని. ఈ లోగా మా ఊరు కూడా రాజధానే అని ఎవరికి వారు చెప్పుకోవడానికి మాత్రం ఎవరి అనుమతి అక్కర్లేదు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గురించి కూడా మాట్లాడుకుంటే… ఒక జీవో ప్రకారం గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఇంకో జీవో ప్రకారం ఇప్పటి ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు చేస్తుంది.
ఇందులో కేంద్రప్రభుత్వ జోక్యం ఉండదు. రాజధాని ప్రకటనపై గత ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో, ఈ ప్రభుత్వానికీ అంతే హక్కు ఉంటుంది. కేంద్రం కూడా (నోటిఫై చేస్తే) గుర్తించిన తర్వాత మాత్రమే రాజధాని మార్చడం కుదరదు. ఇప్పటివరకు అలాంటి గుర్తింపు అమరావతికి లేదు. 2024 వరకూ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని 2014 విభజన చట్టంలో పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఈ చట్టానికి సవరణ చేయలేదు. 2024 లోపు ఏ ప్రభుత్వం, ఏ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయిస్తే ఆ ప్రాంతాన్నే కేంద్రం 2014 చట్టానికి సవరణ చేసి తుది (శాశ్వత) ప్రకటన చేస్తుంది.
అప్పటివరకూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు.
-దారా గోపి @fb