జర్నలిజం అంటే ఎలా ఉండాలి? ఎవరూ రాయనిది మనం రాయాలి. కాస్త క్రియేటివిటీ ఉండాలి. నూతనంలోనూ వినూత్నం కనిపించాలి. అందరూ రాసే వార్తలు మనం రాస్తే మనకంటూ ప్రత్యేకత ఏముంటుంది? అందుకే… ఏదో కొత్తగా థింక్ చేయాలి. సరికొత్తగా వార్తా కథనపు ప్రెజెంటేషన్ ఉండాలి. చరిత్రను వక్రీకరించే సంగతి దేవుడెరుగు… అవసరమైతే చరిత్రను సృష్టించి, తిరగరాయాలి. ఎందుకంటే ఆదివాసీ చరిత్రకు ఎటువంటి శాసనాలు, లిఖిత ఆధారాలు లేవు కదా? ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా సమ్మక్క భక్తులైతే ఇంకా ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే ఆదివాసీలు అమాయకులు కదా? ఇదిగో ఇలాగే ఆలోచించినట్టుంది ‘జగ’నెరిగిన ‘సాక్షి’ పత్రిక. ఇప్పటివరకు ఎవరూ రాయని విషయాన్ని రాసింది. ఎప్పుడూ జరగనిది ఈరోజు జరుగుతుంది… అని ప్రకటించింది. ఇక నేరుగా అసలు విషయంలోకే వెడదాం.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క వన దేవతలు గద్దెలపైకి వస్తారు. అంతకు ముందే జంపన్న, పగిడిద్దరాజు తదితరులు కూడా గద్దెలను అధిష్టిస్తారు. మేడారం జాతరలో సమ్మక్క కుటుంబం దశలవారీగా గద్దెలపైకి రావడమే వనదేవతల దర్శనానికి అంకురార్పణ. చిలుకలగుట్ట నుంచి గురువారం సమ్మక్కను గద్దెకు తీసుకురావడమే మేడారం జాతరలో కీలక ఘట్టం. కానీ సాక్షి పత్రిక ఏం రాసిందో తెలుసా?

మేడారం జాతర చరిత్రలో ఎప్పుడూ కనీ, వినీ ఎరుగని కళ్యాణం ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ మెయిన్ ఎడిషన్ లో రెండు వార్తా కథనాలను వండి వార్చేసింది. పగిడిద్దరాజుకు, సమ్మక్కకు బుధవారం పెళ్లి చేస్తారని ముహూర్తం కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పగిడిద్దరాజు పెళ్లి కొడుకాయె’ అంటూ మేళాలు వాయించేసింది. ‘నేడు సమ్మక్క కల్యాణం’ అని కూడా నిర్ధారించింది. దశాబ్ధాల మేడారం జాతరలో ఎన్నడూ లేని పెళ్లి తంతును వెలుగులోకి తీసుకురావడం ద్వారా సాక్షి పత్రిక సరికొత్త చరిత్రను సృష్టించింది. సమ్మక్క తల్లిని చిలుకల గుట్ట నుంచి గద్దె పైకి తీసుకురావడానికే దాదాపు మరో 36 గంటల సమయం ఉంది. గురువారం ఈ ప్రక్రియ జరుగుతుంది. కానీ బుధవారం పగిడిద్దరాజు-సమ్మక్కల వివాహం జరుగుతుందని ‘సాక్షి’ పత్రిక పెళ్లి బాజాలు వాయిస్తోంది. ఇంతకీ మీరెప్పుడైనా విన్నారా…? మేడారం జాతరలో పగిడిద్దరాజు-సమ్మక్కల వివాహం గురించి…?
ఇదే విషయంపై మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్, ఆదివాసీ నేత ఆలం రామ్మూర్తిని ప్రశ్నించగా, ‘ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకుంటున్నారన్నా.. జాతరలో సమ్మక్క కుటుంబీకులు కలుసుకుంటారు… అంతే… మేమెప్పుడూ వాళ్ల (సమ్మక్క-పగిడిద్దరాజు) పెళ్లి చేయలేదు’ అని స్పష్టం చేశారు. విషయం అర్థమైంది కదా? ఉన్నది ఉన్నట్లు… ఉండదు కనికట్టు అనే సాక్షి పత్రిక ప్రారంభ నినాదాన్ని కాస్త తిరగేసి ‘లేనిది ఉన్నట్లు.. ఉన్నదే కనికట్టు’ అని చదువుకుందామా మరి?