దాదాపు వంద కోట్ల డాలర్ల ఆస్తి సొంతంగా ఎదిగిన ఓ ‘మీడియా టైకూన్’ను హాంకాంగ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ సంఘటన ప్రపంచ మీడియా వర్గాల్లో పెను సంచలనం కలిగించింది. కొత్త జాతీయ భద్రతా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై హాంకాంగ్ బిజినెస్ దిగ్గజం, నెక్ట్స్ డిజిటల్ మీడియా అధిపతి జిమ్మీ లై తోపాటు సంస్థకు చెందిన పలువురు ముఖ్యులను కూడా హాంకాంగ్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
ప్రజాస్వామ్య అనుకూల విధానాల పేరుతో హాంకాంగ్ లో జరిగిన అల్లర్లకు జిమ్మీ లై మద్ధతు ఇచ్చినట్లు పోలీసుల ఆరోపణ. తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ శక్తులతో జిమ్మీ లై జతకట్టారనే తీవ్ర అభియోగాలు మోపుతూ వందలాది మంది పోలీసులు అతని మీడియా హౌజ్ లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారు.
హాంకాంగ్ ప్రభుత్వానికి, బీజింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడే మీడియాను టార్గెట్ చేశారని జిమ్మీ లై ప్రధాన వారసుడు మార్క్ సైమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ముగింపుగా ఆయన అభివర్ణించారు.
గత నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఈ వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని చైనా రూపొందించడం గమనార్హం. మీడియా సంస్థలను స్వాధీనం చేసుకునే అధికారాలను ఈ చట్టంలో పొందుపర్చినట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి.