ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్) చరిత్రలో తొలిసారి ఓ మహిళ సెక్రెటరీ జనరల్ గా ఎన్నికయ్యారు. పురుషాధిక్య ‘బాడీ బిల్డింగ్’ కార్యకలాపాల్లో ఓ మహిళ ఏకగ్రీవంగా ఆయా పదవికి ఎన్నిక కావడం మరో విశేషం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఐబీబీఎఫ్ కార్యవర్గ సమావేశంలో ముంబయికి చెందిన శ్రీమతి హిరాల్ షేథ్ ను సెక్రెటరీ జనరల్ గా ఎన్నుకున్నారు.

ఇప్పటి వరకు ఐబీబీఎఫ్ అధ్యక్షునిగా ప్రేమ్ చంద్, సెక్రెటరీ జనరల్ గా ఛేతన్ పఠార్, కోశాధికారిగా ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. అయితే నాలుగేళ్ల పదవీ కాలం గల ఆయా పదవులకు ఐబీబీఎఫ్ నియమ, నిబంధనల ప్రకారం వరుసగా రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పదవీ కాలం పూర్తయిన గత కమిటీ స్థానంలో ఐబీబీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఇండోర్ లో ఎన్నుకున్నారు.

ఐబీబీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్

ఈ ఎన్నికల్లో ఐబీబీఎఫ్ సెక్రెటరీ జనరల్ గా హిరాల్ షేథ్, ఖమ్మం నగరానిక చెందిన ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐబీబీఎఫ్ చరిత్రలో ఇప్పటి వరకు ఈసీ మెంబర్లుగా మాత్రమే మహిళలు ఎన్నికయ్యారని, ఈసారి ఏకంగా ప్రధాన కార్యదర్శి పదవికి హిరాల్ షేథ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ప్రత్యేక విశేషమని స్వామి రమేష్ కుమార్ చెప్పారు. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ లో లింగ వివక్షకు తావు లేదని ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైందని ఆయన అన్నారు.

సెక్రెటరీ జనరల్ గా ఎన్నికైన హిరాల్ షేథ్ కు ఖమ్మం నగరంతో అనుబంధం ఉందని స్వామి రమేష్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఖమ్మంలో వేర్వేరు సందర్భాల్లో, స్థాయిల్లో జరిగిన బాడీ బిల్డర్స్ పోటీలకు ఆమె మూడుసార్లు హాజరయ్యారని గుర్తు చేశారు. హిరాల్ షేథ్ ఎన్నికపై స్వామి రమేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

Comments are closed.

Exit mobile version