ఫోటో చూశారుగా..? పోలీస్ యూనిఫాంలో దుస్తుల్లో హలం పట్టి సేద్యం చేస్తున్న ఇతను రైతేనా? అని సందేహించాల్సిన అవసరమే లేదు. వాస్తవమే… ఆయన రైతు కాదు. ఓ ఐపీఎస్ అధికారి. పేరు సాయిచైతన్య. ములుగు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏకే-47, లేదంటే 9ఎంఎం పిస్టల్ చేబూని శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఏఎస్పీ ఇలా హలం పట్టి భూమి దున్నడమేంటని ఆశ్చర్యపోకండి. అక్కడే ఉంది అసలు విశేషం.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ ను మావోయిస్టు నక్సలైట్లు ఇటీవల దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా మారుమూల అటవీ ప్రాంతాల్లో గల గిరిజన గూడేలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ములుగు ఏఎస్పీ సాయిచైతన్య నిన్న తాడ్వాయి మండలం జనగలంచవాగు సమీపాన గల మొండ్యాలతోగు గొత్తికోయ గూడేం తనిఖీకీ వెళ్లారు. అదే సమయంలో స్థానిక గొత్తికోయ గిరిజనుడు నాగలి దున్నడం సాయిచైతన్యను ఆకట్టకుంది. ఇంకేముంది తనూ హలం పట్టి కాసేపు అలా భూమిని దున్నేశారు.
అసలు విషయమేమిటంటే…? ఏఎస్పీ తన సరదాకోసం మాత్రం పాలె పట్టి ఇలా నాగలి దున్నలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మావోయిస్టు నక్సల్స్ తాజా కార్యకలాపాల వెనుక కొందరు గొత్తికోయల సహకారం ఉందనే అనుమానం పోలీసు శాఖలో బలీయంగా ఉంది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లోని రెండు ప్రధాన తెగలకు చెందిన ఆదివాసీలు చీలిపోయారనేది అందరికీ తెలిసిందే. ఆయా తెగల్లోని గొత్తికోయలు మావోలకు వెన్నుదన్నుగా, మురియా జాతికి చెందినవారు ఒకప్పటి సల్వాజుడుం సంస్థకు, ప్రస్తుతం ప్రభుత్వానికి అండగా ఉన్నారనే వాదన అక్కడ ఉండనే ఉంది. ఈ పరిణామాల్లోనే ఛత్తీస్ గఢ్ లోని యుద్ధవాతావరణానికి విసిగి వేసారిన వేలాది గొత్తికోయ కుటుంబాలు తెలంగాణాలోని అడవుల్లో ఆశ్రయం పొందాయనే ప్రచారం ఉంది. కానీ మావోయిస్టులు పథకం ప్రకారం ముందస్తుగా ఛత్తీస్ గఢ్ గొత్తికోయలను తెలంగాణా అడవులకు పంపిస్తున్నారని పదేళ్లుగా పోలీసులు అనుమానిస్తునే ఉన్నారు.
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో వలస వచ్చిన గొత్తికోయలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరికి సౌకర్యాల కల్పన అంశంలోనూ ప్రభుత్వవర్గాల్లో భిన్నవాదనలు ఉన్నాయి. అటవీ అధికారులు గొత్తికోయల నివాసాలను ధ్వంసం చేసిన సంఘటనలు అనేకం. ఈ పరిస్థితుల్లోనే గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టు నక్సల్స్ కార్యకలాపాల ఉనికి బహిర్గతమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన భద్రతా సలహాదారు విజయకుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ములుగు జిల్లా వెంకటాపురంలో సమావేశమై నాలుగు గంటలపాటు చర్చించడం ఈ సందర్భంగా గమనార్హం.
దీంతో గొత్తికోయల నివాస ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గొత్తికోయల గూడేల్లోనే మావోయిస్టులకు షెల్టర్ లభించే అవకాశాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందువల్లే గొత్తికోయల నివాస ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టు నక్సలైట్లకు ఎటువంటి అశ్రయం కల్పించవద్దని హితవు చెబుతున్నారు. సాయిచైతన్య వంటి ఐపీఎస్ అధికారులు ఇలా నాగలి దున్ని మరీ గొత్తికోయలతో దోస్తీ చేస్తున్నారు. పోలీసులు శత్రువులు కాదనే భావనను కల్పిస్తున్నారు. మావోయిస్టుల ఆచూకీ కోసం గొత్తికోయలను ఇలా మచ్చిక చేసుకోవడం వెనుక దాగిన అసలు మర్మం అదేనట.