మావోయిస్టు పార్టీకి ‘గుండెకాయ’గా పరిగణించే ‘మిలీషియా’పై తెలంగాణాకు చెందిన గ్రై హౌండ్స్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఫలితంగా నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టు నక్సలైట్లు మృతి చెందారు. ఈ ఘటన మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణాలోకి ప్రవేశించి ‘యాక్షన్’కు దిగాలనే భానవతో తమ కదలికలను ముమ్మరం చేసిన ‘మిలీషియా’కు శరాఘాతంగా పోలీసు వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ఏమిటీ ‘మిలీషియా’?
మిలీషియా అంటే తెలంగాణా నక్సల్స్ పరిభాషలో లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్జీఎస్). దళాలకు దళాలు మూవ్ మెంట్ చేసే పరిస్థితులు లేనప్పుడు లోక్ గెరిల్లా స్క్వాడ్లను మావోయిస్టు నక్సలైట్లు ఏర్పాటు చేస్తుంటారు. స్టానిక మిలిటెంట్లతో ఏర్పాటు చేసే లోక్ గెరిల్లా స్క్వాడ్లనే ఛత్తీస్ గఢ్ నక్సల్స్ పరిభాషలో ‘మిలీషియా’గా వ్యవహరిస్తుంటారు. గ్రామాల వారీగా చురుగ్గా కదులుతూ పార్టీ కార్యకలాపాలను నిర్వర్తించడమేగాక, పోలీసులకు స్థానికులు సహకరించకుండా వ్యవహరించడమే మిలీషియాకు నిర్దేశించిన చర్యలుగా చెబుతుంటారు. అంతేగాక స్థానికంగా ‘యాక్షన్’ టీములుగానూ మిలీషియా వ్యవహరిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే అసలు దళాలను మించి మిలీషియా ‘యాక్షన్’కు దిగిన ఘటనలూ లేకపోలేదు. గతంలో ఎల్జీఎస్ గా వ్యవహరించిన ప్రస్తుత మిలీషియాకు ఆయుధాలు సమకూర్చే స్థాయికి మావోయిస్టు పార్టీ ఎదిగిందని, అందువల్లే ఇటువంటి ఘటనల్లో మిలీషియా సభ్యుల వద్ద కూడా అధునాతన ఆయుధాలు లభ్యమవుతున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అసలేం జరిగిందంటే…?
ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం మావోయిస్టు నక్సల్స్, పోలీసుల మధ్య భారీ పోరాటమే జరిగినట్లు సమాచారం. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం… తెలంగాణా రాష్ట్రానికి చెందిన గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు నక్సల్స్ కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెసర్లపాడు సమీపంలోని దోరగూడ అడవుల్లో మావోయిస్టు పార్టీ నక్సల్స్ తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన భీకరపోరులో ఆరుగురు నక్సలైట్లు మరణించగా, మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన నక్సల్స్ లో చర్ల ఏరియా మిలీషియా కమాండ్ మధు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ ఘటనలో మధు చనిపోవడంతో తెలంగాణా సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పడినట్లుగానే పోలీసులు అంచనా వేస్తున్నారు. చర్ల ప్రాంత మిలీషియా దళం యావత్తూ తుడిచిపెట్టుకుపోయినట్లు భావిస్తున్నారు.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Comments are closed.

Exit mobile version