ఫొటోను ఓసారి నిశితంగా పరిలించండి. చూశారుగా…! ఇప్పుడు విషయంలోకి వెడితే.., పొంగులేటి శ్రీనివాసరెడ్డి… గుర్తున్నారు కదా? వైఎస్ఆర్ సీపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షునిగా, ఖమ్మం ఎంపీ హోదాల్లో దాదాపు ఐదేళ్ల క్రితం గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్న బడా కాంట్రాక్టర్-కమ్-రాజకీయ నాయకుడు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ, గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ లభించని అవమానకర పరిణామాలను తమ నేత లోలోపలే దిగమింగుకుంటున్నారనేది పొంగులేటి అభిమానుల ఆవేదన. గడచిన ఏడాదిన్నర కాలంగా పొంగులేటి రాజకీయ భవితవ్యమేమిటో తెలియని అయోమయ స్థితిని ఆయన అనుచరులు, అభిమానులు ఎదుర్కుంటున్నారు. ఇటీవల ‘పొంగులేటి’ బర్త్ డే వేడుకల ఫ్లెక్సీలను సైతం ఖమ్మం నగరంలో తొలగించినప్పటికీ, నిస్సహాయస్థితిని ఎదుర్కున్న చేదు అనుభవాన్ని ఆయన వర్గీయులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ ఆలీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు నిన్న ఖమ్మం పర్యటనకు వచ్చారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ సహా ఆయా నలుగురు మంత్రులు హెలీకాప్టర్ దిగగానే నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నలుగురు మంత్రులు పాల్గొన్నారు. కానీ ఖమ్మం నగరంలోనే జరిగిన ఆయా కార్యక్రమాలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూరంగా ఉండడం రాజకీయ చర్చకు దారి తీసింది.
కానీ తన పర్యటన కార్యక్రమాలన్నీ ముగిశాక మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డిని మంత్రి కేటీఆర్ హెలీకాప్టర్ లో ఎక్కించుకుని మరీ తన వెంట తీసుకువెళ్లిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ షాద్ నగర్ బూర్గుల టోల్ గేట్ వద్ద పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ వెంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బంద్ లో పాల్గొనడం సహజంగానే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఈ తాజా పరిణామాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొంగులేటి సన్నిహితులు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయా దృశ్యాలు చోటు చేసుకోవడం, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం.