ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు అంశం రాజకీయ దుమారానికి కారణమైంది. యాధృచ్చికమో, కాకతాళీయమో తెలియదుగాని ఆయన బర్త్ డే ఉత్సవాలకు రెండు రోజుల ముందు ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు తీసుకున్న నిర్ణయం ఒకటి ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు ఫ్లెక్సీల తొలగింపు అంశం ఖమ్మం అధికార పార్టీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
విషయమేమిటంటే… ఈనెల 28వ తేదీన ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో ఆయన బర్త్ డే వేడుకల సంబరాన్ని ప్రతిబింబించే విధంగా లక్షలాది రూపాయలను ఖర్చుచేసి మరీ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
సరిగ్గా సంబరాల తేదీకి రెండు రోజుల ముందు అంటే నిన్న ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఫెక్సీలు, హోర్డింగుల తాయరీదార్లతో, పోలీసులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటి వల్ల ఎటువంటి విపత్తు జరిగినా దానిని ఏర్పాటు చేసినవారే బాధ్యత వహించాలని కూడా ఆయన హెచ్చరించారు. వాస్తవానికి మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశం అధికారిక కార్యక్రమాల్లో భాగమే కావచ్చు.
![ts29 ponguleti](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/ponguleti.jpeg?resize=788%2C584&ssl=1)
కానీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ పదిరోజుల ముందే హోర్డింగ్ ఓనర్లను అభ్యర్థించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ వర్గాలు ఫ్లెక్సీలను తయారు చేయించాయట. అభిమానుల కోరిక మేరకు నగరంలోని పలు ముఖ్య కేంద్రాల్లో పెద్ద పెద్ద హోర్డింగులపై పొంగులేటి బర్త్ డే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం మున్సిపల్ కమిషనర్ సమావేశం నిర్వహించి, ఫ్లెక్సీలపై కీలక ఆదేశాలు జారీ చేయడంతో హోర్డింగులపై ఏర్పాటు చేసిన పొంగులేటి ఫ్లెక్సీలను నిన్న రాత్రి తొలగించారు.
ఈ తాజా పరిణామం అధికార పార్టీ రాజకీయాల్లో పెను దుమారానికి కారణమైంది. పొంగులేటి అభిమానులే కాదు, ఇతర వర్గాలు సైతం ఈ పరిణామాలపై చర్చించుకుంటున్నాయి. కార్పొరేషన్ అనుమతి ఉంటేనే యాడ్ ఏజెన్సీలు హోర్డింగులు నిర్మిస్తాయని, కానీ హోర్డింగులపై ఏర్పాటు చేసిన పొంగులేటి బర్త్ డే ఫ్లెక్సీలను తొలగించడం వెనుక అసలు మతలబు ఏమిటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు లేకుండానే హోర్డింగులు,ఫ్లెక్సీలు పెడుతున్నారా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
![ts29 stpl flexi 1](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/stpl-flexi-1.jpg?resize=788%2C460&ssl=1)
అనుమతులు లేకుండా హోర్డింగులు నిర్మిస్తుంటే, ఇన్నాళ్లపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఎందుకు చూస్తూ ఊర్కున్నారనే వాదన కూడా ప్రస్తుతం తెరపైకి వస్తోంది. ఇదే హోర్డింగులపై ఇటీవలి కాలంలో గల్లీ లీడర్ల నుండి బడా నాయకుల జన్మదిన ఫ్లెక్సీలు పెట్టినప్పుడు చట్టాలు, నిబంధనలు గుర్తుకు రాలేదా ? అని పొంగులేటి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య ఓ కార్పొరేటర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద పెద్ద హోర్డింగులు, రోడ్లకు అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తంగా పొంగులేటి పుట్టినరోజు ఫ్లెక్సీల తొలగింపు ఘటన ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.