ప్రశ్న లక్ష్యంగా అనేక ప్రశ్నలు సంధించారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అలియాస్ జీనుగు నరసింహారెడ్డి. ఈ ప్రశ్నల ద్వారా అనేక అంశాలను ఆయన టచ్ చేశారు. రాజ్యం నుంచి అహంకారం వంటి పదాలను ఉటంకిస్తూ జంపన్న సంధించిన ఈ ప్రశ్నలపై విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ తనను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేయడం, అందుకు ప్రతిగా ఆయన సమాధానం ఇవ్వడం, అభయ్ మరో లేఖ ద్వారా హెచ్చరికను పునరుద్ఘాటించడం వంటి పరిణామాల నేపథ్యంలో జంపన్న ‘ప్రశ్న’ పోస్టు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా జంపన్న రాసిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ జంపన్న ఏమంటున్నారో దిగువన ఉన్నది ఉన్నట్లుగా చదవవవచ్చు.

ప్రశ్న లక్షోపలక్షలు అవుతుంది.
ప్రశ్న జవాబు కోరుతుంది.
ప్రశ్న సమస్యను పరిష్కరించమంటుంది.

ప్రశ్న హేతుబద్దమైనది.
ప్రశ్న మృదువైనది కాదు.
ప్రశ్న అడ్డంకులకు లోబడేది కాదు.
ప్రశ్న మధురమైనది కాదు.
ప్రశ్న చేదుగానే ఉంటుంది.
ప్రశ్న రాజ్యాన్ని ప్రశ్నిస్తుంది.
ప్రశ్న వ్యవస్థను ప్రశ్నిస్తుంది.

ప్రశ్న అధికార అహంకారాన్ని ప్రశ్నిస్తుంది.
ప్రశ్న బూర్జువా నాయకులను ప్రశ్నిస్తుంది.
ప్రశ్న బ్రాహ్మణవాదాన్ని ప్రశ్నిస్తుంది.
ప్రశ్న కమ్యూనిస్ట్ నాయకులను ప్రశ్నిస్తుంది.

కమ్యూనిస్టు నాయకులు, విప్లవ నాయకులు, సంస్థలు ప్రశ్నకు అతీతం కా(రా)దు.

ప్రశ్న అనాదిగా ఉన్నది.
ప్రశ్న బానిస సమాజంలో,
భూస్వామ్య సమాజంలో, పెట్టుబడిదారి సమాజంలో ఉన్నది.

ప్రశ్న నూతన ప్రజాస్వామికంలో ఉన్నది.
సోషలిస్టు సమాజంలో ఉన్నది.

ప్రశ్న గతంలోనూ, వర్తమానంలోనూ ఉన్నట్లే భవిష్యత్తులోనూ వుంటుంది.

ప్రశ్నను వ్యతిరేకించిన,
హెచ్చరించిన,
కన్నెర్ర చేసిన – రాజ్యాలు, ఆధిపత్య శక్తులు – వారు ఎవరైనప్పటికీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు.

ప్రశ్నకు బలం ఇచ్చిన కమ్యూనిస్టులు, విప్లవకారులు ప్రశ్నించడాన్ని జీర్ణించకోలేకపోయినప్పుడు వారి చరిత్ర బజారుపాలు అయింది.
వారి అభివృద్ధి ఆగిపోయింది.

జంపన్న

ప్రశ్నను బంధించ లేవు.
ప్రశ్నకు రాజకీయమైన ఆరోగ్యకర జవాబు తప్ప చిల్లర కారు కూతలు – జవాబు కాదు.

మే … మే అంటూ చిరు ప్రశ్నలను సహిస్తూ మౌలిక ప్రశ్నలపై జవాబు ఇవ్వకుండా దాట వేయడం, దాడి చేయడం ప్రజాస్వామ్యం కాదు.

ఎల్లప్పుడూ ప్రతి ప్రశ్నలోనూ విషయం చూసే చైతన్యం మాత్రమే సామాజిక అభివృద్ధికి, విప్లవాభివృద్ధికి బలం.

రాజ్యం ఏలే వారికి,
పార్టీలు, సంస్థలు నడిపే వారికి, పోరాడే వారికి ప్రశ్నను అర్థం చేసుకునే ప్రజాస్వామిక చైతన్యం లేకపోతే – లేదా – తగ్గిపోతే వారి తలకాయకు బొప్పి కట్టడాన్ని ఎవరు తప్పించలేరు.
ఇదే చారిత్రక సత్యం.

ప్రశ్న ప్రజాస్వామ్యం.
ప్రశ్నను హెచ్చరించేది అణచివేసేది అప్రజాస్వామ్యం,ఆధిపత్య వాదం, బ్రాహ్మణవాదం మాత్రమే.

ప్రజాస్వామ్యం లేకుండా సోషలిజం లేదు.

ప్రశ్న నుండి మాత్రమే ఏమైనా నేర్చుకుంటాం తప్ప – వందిమాగదుల నుండి, భట్రాజుల పొగడ్తల నుండి నేర్చుకునేది గుండు సున్న మాత్రమే.

పొగడ్తలతో పొట్ట నిండితే – అహంకారం, బ్రాహ్మణవాదం తలకెక్కి ప్రశ్నించిన వారిపై కారాలు మిరియాలు నూరుతుంది.

ఉదయించే ప్రశ్నలను అస్తమించే వెనుకబడిన సంప్రదాయ భావాలు అడ్డుకొలేవు.

ప్రశ్న లక్షోపలక్షలు అవుతుంది. మళ్లీ చెప్తున్నాను ….
ప్రశ్న లక్షోపలక్షలు అవుతుంది.

Comments are closed.

Exit mobile version