ఒమిక్రాస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలో తొలి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటైంది. హైదరాబాద్ మహానగరంలోని టోలీచౌక్ ప్రాంతంలో గల ఓ కాలనీలో ఈ కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు. టోలీచౌక్ ప్రాంతానికి చెందిన ఓ కాలనీలో తొలుత రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆయా ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించడం గమనార్హం.
ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25 ఇళ్ల పరిధిలో ఈ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ అయిన విషయం విదితమే. బాధితులను గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒమిక్రాన్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాలనీలో రంగంలోకి దిగిన 25 హెల్త్ టీమ్స్ 700 ఇళ్లలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు పూర్తి చేయగా, 36 గంటల తర్వాత ఫలితాలు వస్తాయని వైద్యాధికారులు ప్రకటించారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ రిజల్ట్ వస్తే, నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి శాంపుల్స్ పంపించాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణాలో గురువారం కూడా ఒమిక్రాన్ కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం గుర్తించిన తాజా కేసులతో కలిపి బాధితుల సంఖ్య ఏడుకు పెరిగినట్లు అధికారికంగానే వెల్లడించారు. ఈ పరిణామాలు సహజంగానే భద్రతపై ప్రజల్లో అప్రమత్తతను తెలియజేస్తున్నాయి.