దేశమే పెద్ద చెరువు, హిందువులే మేలురకం చేపలు, ముస్లిములే ఎరలు, గాలమే హిందూత్వ రాజనీతి, వేటగాళ్లే మోదీ, అమిత్ షా లు, చేపల బుట్టలే NRC, CAB, పెట్టుబడిదార్లే చేపల భక్షకులు, ఇదే భారతదేశ వర్తమాన ఫాసిస్టు రాజకీయ మృత్యు క్రీడ అంటున్నారు ఈ వ్యాస రచయిత. సారంలో ప్రాధమికంగా శ్రమజీవులపై, రూపంలో ప్రధానంగా హిందువులపై ఎక్కుపెట్టిన ఆర్ధిక, రాజకీయ ఉగ్రవాద యుద్ధంలో అస్త్రమే CABగా అభిర్ణించారు రచయిత. వ్యాసం కాస్త సుదీర్ఘంగా ఉనప్పటికీ అనేక అంశాలను రచయిత సృశించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే కాదు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు కూడా వ్యాపించిన పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో బీజేపీ అగ్ర నేతల అసలు వ్యూహం, లక్ష్యం ఏమిటన్నది రచయిత తన వ్యాసంలో పూసగుచ్చినట్లు వివరించారు. ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఇక చదవండి.

(ఇఫ్టూ ప్రసాద్)

గత రెండు, మూడేళ్లుగా NRC పేరును తరచుగా వింటున్నాం. ఈమధ్య హఠాత్తుగా CAB పేరును కూడా కొత్తగా వింటున్నాం. పాతది NRC ప్రక్రియ! కొత్తది CAB ప్రక్రియ! పాత ప్రక్రియకు ఉపయోగపడే అనుబంధ చర్యే కొత్త ప్రక్రియ అని మోడీ ప్రభుత్వం వాదిస్తోంది. దానికి CAB పూర్తి విరుద్ధ చర్యగా ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్థానిక ప్రజల వాదన. నిన్న NRC పేరుతో తమను మోడీ ప్రభుత్వం నమ్మించి, నేడు CAB పేరుతో వంచిస్తున్నదనేది కూడా వారి వాదన! మరికొంత ముందుకెళ్తే, తమపై మోడీ ప్రభుత్వం నిన్న తెలివిగా NRC వల విసిరిందనీ, తెలియక అందులో చిక్కిన తమను నేడు CAB బలిపీఠం పైకి తెలివిగా నడిపిస్తున్నదనీ వారి మరో వాదన!

నిజానికి పాత NRC ప్రక్రియను నిన్న తన భుజానికెత్తుకున్న కారణంగానే బిజెపి ఈశాన్య రాష్ట్రాల్లో చొరబడగలిగింది. (చొరబాటు పదాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే ఉపయోగించాను. అక్కడ నిన్న బీజేపీ ప్రవేశించిందని గానీ, వేళ్లూనుకుందని గానీ నేను పేర్కొనడం లేదు. అందుకు కారణం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో NRCని అడ్డం పెట్టుకొని బిజెపి రాజకీయంగా ఒక అక్రమ చొరబాటుదారు పాత్ర పోషించింది) నిన్న వివిధ ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి అక్రమ చొరబాటుకు NRC ప్రక్రియ ఒక ‘లాగుడు కారకం’ (pulling factor) గా పని చేసింది. నేడు అదే ఈశాన్య రాష్ట్రాల నుండి బిజెపి గెంటివేతకు CAB ఒక శక్తివంతమైన ‘తోపుడు కారకం’ (pushing factor) గా పని చేస్తోంది. అందుకు బలమైన కారణం ఉంది.

ఈశాన్య రాష్ట్రాల ప్రజల దృష్టిలో స్థానికేతర ప్రజలందరూ విదేశీయులే! భారతదేశానికి చెందిన ఇతర రాష్ట్రాల ప్రజలు కాదా ‘విదేశీయులే’! ఉదా: అస్సాం ప్రజల దృష్టిలో అస్సామేతరులు విదేశీయులే! మిగిలిన ఈశాన్య రాష్ట్రాల ప్రజల దృష్టిలో కూడా అంతే! ఒక్కమాటలో చెప్పాలంటే, ఈశాన్య భారత ప్రజల దృష్టిలో విజాతీయులకూ విదేశీయులకూ మధ్య గుణాత్మక తేడా లేదు. (ఈ పరిస్థితి దేశంలో మిగిలిన రాష్ట్రాలకి భిన్నమైనది. ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వలస ప్రజల పట్ల మిగిలిన ఏ రాష్ట్రాల ప్రజల్లో లేని ఇలాంటి ప్రత్యేక భావన కేవలం ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనస్సుల్లో ఉండటానికి బలమైన చారిత్రక కారణాలు ఉన్నాయి. ఐతే అది మరో ప్రత్యేక సబ్జెక్టు! అది అప్రస్తుతమూ, అసందర్భమూ)

పైన పేర్కొన్న ‘విదేశీయుల’ ని ఈశాన్య రాష్ట్రాల స్థానిక ప్రజలు ఏకాశిలా ఖండంగా జమ కట్టడం లేదు. వారి దృష్టిలో విదేశీయులందరూ ఒకటి కాదు. వారిని సమానులుగా చూడరు. అట్టి ‘విదేశీయుల’ మధ్య తేడాల్ని చూస్తారు. అంటే వారిలో వర్గీకరణ ఉంది. అట్టి వర్గీకరణకు ప్రధాన ప్రాతిపదిక ‘జాతి’, ‘ప్రాంతం’ అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అవి మాత్రమే ఏకైక ప్రాతిపదిక కాదు. ‘వర్గం’ కూడా మరో ముఖ్య ప్రాతిపదికే! ‘వర్ణం’ (కులం) సైతం మరో ప్రాతిపదిక గా ఉంది.

దీనిలో జాతి (దీనికి భాష, సంస్కృతులు చోదక కారకాలు- driving factors), ప్రాంతం, వర్గం, వర్ణం వంటి ప్రాతిపదికలున్నాయి. అందుకే ఈశాన్య రాష్ట్రాల భౌతిక, వస్తుగత పరిస్థితుల్ని సూక్ష్మ దృష్టితో శాస్త్రీయ విశ్లేషణ చేయకుండా, అక్కడి ప్రజల మనోభావాలను గంప గుత్తగా అంచనా వేయరాదు. అదేవిధంగా వాళ్ళు నిన్న NRC ద్వారా బిజెపి ని రాజకీయంగా ఆశ్రయించడానికీ; నేడు CAB ద్వారా తిరిగి దానికి దూరం కావడానికీ గల వాస్తవ కారణాల్ని కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేము. ఆయా నిర్ధిష్ట భౌతికస్థితి ని అర్ధం చేసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం.

ఈశాన్య రాష్ట్రాల భౌతిక పరిస్థితిని లోతుగా అర్ధం చేసుకునేందుకు తొలుత అక్కడి ‘విదేశీ’ వలసకారుల పొందికను వర్గీకరణ చేయాల్సి వుంది. దానికి అవసరమైన నిర్దిష్ట అంకెలూ, సంఖ్యలూ ప్రస్తుతం అందుబాటులో లేవు. ఐతే నిర్ధిష్ట గణాంకాలు లేకపోయినా, వాటి ధోరణుల సాధారణత్వం పట్ల స్పష్టత ఉంది. అట్టి స్పష్టత ఆధారంగా ‘అంచనా అంకెల’ (Estimeted numbers) ని ‘సుమారు’ పేరుతో ఇక్కడ ఉదహరిస్తున్నాను. దయచేసి మిత్రులు దీని పరిమితిని గమనంలో ఉంచుకోగోరుతున్నా.

పై ‘విదేశీయుల’లో సుమారు 90 శాతం మంది రెక్కాడితే తప్ప డొక్కాడని నిరుపేద శ్రామికులే! సుమారు 8 నుండి 9 శాతం మంది మధ్యతరగతి, పెటీ బూర్జువా వర్గాల ప్రజలు ఉండొచ్చు. (వారిలో ఉద్యోగులతో పాటు చిరు వ్యాపార, వర్తక వర్గాల వాళ్ళున్నారు) మిగిలిన ఒకట్రెండు శాతం మంది శ్రమదోపిడీ కోసం వలస వెళ్లిన దోపిడీ వర్గీయులే! బడా కార్పొరేట్ శక్తులు కావచ్చు. లేదా బడా వాణిజ్యవేత్తలూ, బలిసిన వడ్డీ వ్యాపారులూ కావచ్చు. ఈ ఒకట్రెండు శాతం మంది వర్గపరంగా దోపిడీ వర్గీయులు కాగా, సామాజికంగా దాదాపు అందరూ అగ్ర వర్ణాలకు చెందిన వాళ్ళే! ఇకపోతే పైన పేర్కొన్న 8 నుండి 9 శాతం మంది వర్గపరంగా చూస్తే, స్థూలవిశ్లేషణలో పీడిత వర్గీయులే! సామాజికంగా ఎక్కువ శాతం మంది అగ్రవర్ణీయులే! 90 శాతం మంది శ్రామిక జనం విషయానికి వస్తే, వారు వర్గంగా అట్టడుగు పీడిత వర్గీయులే! సామాజికంగా అందులో అత్యధిక శాతం మంది అట్టడుగు దళిత లేదా వెనకబడ్డ సామాజిక వర్గీయులే! ఈ కోణంలోనే కాకుండా ఇప్పుడు మరో కోణంలో కూడా విశ్లేషిద్దాం.

బ్రిటిష్ వలస పాలనలో ఈశాన్య రాష్ట్రాల ఆర్ధిక, రాజకీయ రంగాలపై బెంగాల్ ప్రభావం బలంగా వుండేది. (1911 వరకు బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా కావడం గమనార్హం) ప్రపంచ వ్యాప్తంగా ‘నాగరిక’ ప్రాంతాల నుండి ఆదివాసీ ప్రాంతాల్లోకి ప్రజలు వలస వెళ్లినట్లే, బెంగాల్ నాగరిక ప్రాంతాల నుండి కూడా ఈశాన్య రాష్ట్రాల ఆదివాసీ ప్రాంతాల్లోకి ఆనాడు విస్త్రుతంగా వలసలు సాగాయి. వారిలో కొద్దిశాతం మంది దోపిడీ వర్గీయులతో పాటు అత్యధిక శాతం శ్రామిక జనులు కూడా ఉన్నారు. (మత ప్రసక్తి లేకుండా సాగిన హిందూ, ముస్లిం శ్రామికజన వలసలవి) కాలక్రమం లో దోపిడీ వర్గీయులలో అక్కడే స్థిరపడ్డ వాళ్ళు కొద్ది శాతం మంది ఉంటే, కలకత్తాను తమ కేంద్రంగా చేసుకుంటూనే ఈశాన్య రాష్ట్రాలలోని తమ వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక ప్రక్రియలను ఆపరేట్ చేసిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. కానీ ఆస్తులు లేని నిరుపేద శ్రామిక జనం మాత్రం తాము వెళ్లిన ఈశాన్య రాష్ట్రాల్లోనే శాశ్వతంగా స్థిరపడ్డారు. వాటిని తమ నివాస ప్రాంతాలుగా కూడా వారు మార్చుకున్నారు. బ్రిటిష్ ఇండియా లో సాగిన మొదటిదశ వలసలవి. అవి1947 వరకు సాగాయి. 1947 లో ఓ పరిణామం జరిగింది. అది కూడా క్లుప్తంగా తెలుసుకుందాం.

1947లో మతప్రాతిపదికపై దేశవిభజన జరిగింది. ఓవైపు తూర్పు ఇండియా, మరోవైపు ఈశాన్య ఇండియాలలో భిన్న పరిస్థితి ఏర్పడింది. బెంగాల్ (వంగ) జాతికి వస్తే, బలవంతంగా ఏకజాతిని విడగొట్టి, పరస్పర విదేశీయులుగా మార్చిన పరిస్థితి ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాలకు వస్తే, పరస్పర విజాతీయుల్ని బలవంతంగా కలిపి ఒకే దేశీయులుగా మార్చిన పరిస్థితి ఏర్పడింది. విభజించి పాలించే బ్రిటిష్ కుటిల నీతిలో భాగమది. ఒకవైపు ఒకే బెంగాల్ జాతి (వంగజాతి అని కూడా అంటారు) కి చెందిన ప్రజల్ని చీల్చి మతప్రాతిపదిక పై పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ లో విడగొట్టారు. మరోవైపు వేర్వేరు నిర్దిష్ట ఆదివాసీ ఆస్తిత్వాలతో కూడిన ఈశాన్య ఆదివాసీ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేవలం కంటితుడుపు స్వయంప్రతిపత్తితో భారత్ లో వాటిని విలీనం చేశారు. (పైన మూడో పేరా చివరలో పేర్కొన్న “మరో సబ్జెక్టు” కు పునాది ఇక్కడే ఉంది) ఆనాడు అట్టి స్వయంప్రతిపత్తి ని రాజ్యాంగబద్దం చేసిన ఆర్టికల్ 371 కి కూడా నేడు గ్యారంటీ లేకపోవడం మరో gf అంశమనుకోండి. ఇదీ 1947 లో జరిగిన పరిణామం. ఆ తర్వాత పరిణామక్రమం మరో రకంగా సాగింది. దాన్ని కూడా ప్రస్తావించుకుందాం.

బ్రిటిష్ ఇండియాలో 1947కి ముందు సాగిన మొదటి దశ వలసలు గూర్చి పైన చేప్పుకున్నాం. 1947 నుండి 1971 లో బంగ్లాదేశ్ ఏర్పడే వరకూ రెండో దశ వలసలు సాగాయి. ముఖ్యంగా శ్రామిక వలసల ప్రక్రియ గూర్చి వద్దాం. రెండోదశ వలసల క్రమంలో ఒక ముఖ్యమైన మార్పువుంది. అంతకు ముందే వంగదేశం (ఉమ్మడి బెంగాల్) నుండి ఈశాన్య రాష్ట్రాలకు మొదటి దశవలస వచ్చి స్థిరపడ్డ బెంగాలీ కుటుంబాల ఆదారంతో రెండోదశ వలసలు సాగాయి.

ఆయా ప్రక్రియ లో భాగంగా బ్రిటిష్ ఇండియాలోని ఉమ్మడి బెంగాల్ లో ఓ పల్లెటూరుకి చెందిన ఓ కుటుంబం మొదటి తరం వలస వెళ్లి అస్సామ్ లోనో లేదా మరో చోటనో స్థిరపదిందనుకుందాం. అదే ఊరుకు చెందిన మరో కుటుంబం రెండోదశ (రెండోతరం కూడా) వలసకు ఆధారమౌతుంది. ఉమ్మడి బెంగాల్ లోని తూర్పు, పడమర ప్రాంతాల నుండి మొదటిదశ వలసలు ఈశాన్య రాష్ట్రాలకు సాగాయి. కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాద కుట్ర వల్ల తూర్పు వంగ ప్రాంతం తూర్పు బెంగాల్ పేరుతో పాకిస్థాన్ లో చేరింది. పడమర వంగ ప్రాంతం పశ్చిమ బెంగాల్ పేరుతో భారత్ లో కలిసింది. రెండోతరం వలసలకు మొదటితరం వలసలు ఆధారంగా వుంటాయని పైన పేర్కొనడమైనది. ఆ ప్రకారం రెండు దేశాలలోని బెంగాలీ శ్రామిక ప్రజలు ఈశాన్య రాష్ట్రాలోకి వలస వెళ్లేందుకు ప్రాతిపదిక (Basis) ఉంది. UNO చార్టర్ ప్రకారం 1947 తర్వాత పశ్చిమ బెంగాల్ నుండి వలస వచ్చే వాళ్ళు స్వదేశీయులౌతారు. కానీ తూర్పు బెంగాల్ నుండి వలస వస్తే విదేశీయులౌతారు. ఐతే విచిత్రమైన విషయం ఏమిటంటే, పై రెండు ప్రాంతాల నుండి వలస వచ్చిన బెంగాలీయులు కూడా అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల స్థానిక ప్రజలు దృష్టిలో ‘విదేశీయులే’ కావడం గమనార్హం

పైన పేర్కొన్న రెండోదశ వలస వెళ్లే శ్రామిక కుటుంబాలకు రెండు ప్రేరేపక కారణాలున్నాయి. మొదటిది, అంతవరకూ బెంగాల్ లో ఉండిపోయి, స్వంత గ్రామంలోనే జీవిస్తున్న తన కుటుంబ ఆర్ధిక స్థితి కంటే, గత తరంలో అస్సాం కి వలస వెళ్లిన తన సాటి గ్రామస్తుడి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి ఉండాలి. రెండవది, బెంగాల్ లో తన కుటుంబ ఆర్ధిక స్థితి గతంతో పోల్చితే దిగజారి, పొట్టకూటి కోసం రెక్కలతో వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడి వుండాలి. ఈ రెండింటిలో ఏదో ఓ భౌతిక పరిస్థితి ఏర్పడితే, సాధారణంగా రెండో తరం వలసలు కొనసాగుతాయి. ఈ ప్రకారం రెండోదశ వలసలు పశ్చిమ బెంగాల్ కంటే, తూర్పు బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలోకి ఎక్కువగా సాగాయి. అందుకు గల కారణం కూడా తెలుసుకుందాం.

దేశవిభజన తర్వాత ఇండియాకు చెందిన పశ్చిమ బెంగాల్ గ్రామీణ ఆర్థికస్థితిలో మౌలిక వృద్ధి రాని మాట నిజమే! ఐతే పరిగణించదగ్గ కొంత మార్పు వుంది. అందుకు భిన్నంగా పాకిస్థాన్ కి చెందిన తూర్పు బెంగాల్ ఆర్థికస్థితి దిగజారింది. (ఆ కారణాలు మరో అప్రస్తుత అంశం) ‘నీరు పల్లమెరుగు’ అన్నట్లు శ్రామిక వలసలు ‘దుర్భర దాస్యస్తితి’ నుండి ‘దాస్యస్థితి’ వైపుకూ; ‘కడు పేదరికం’ నుండి ‘నిరు పేదరికం’ వైపుకూ; ‘నిరు పేదరికం’ నుండి ‘పేదరికం’ వైపుకూ కొనసాగడం సహజ సమాజ ధర్మమే! ఈ సహజ సూత్రం ప్రకారం పశ్చిమ బెంగాల్ కంటే, తూర్పు బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలలోకి రెండోదశ శ్రామిక వలసలు ఎక్కువగా సాగాయి. అవి 1971 వరకూ సాగాయి. అంతవరకూ తూర్పు పాకిస్తాన్ గా పేరొందిన తూర్పు బెంగాల్ 1971లో పాకిస్థాన్ నుండి విడిపోయి, స్వతంత్ర్య దేశంగా ఏర్పడింది. దీనితో రెండోదశ వలసలు ముగిశాయి.

1971 తర్వాత ప్రధానంగా బాంగ్లాదేశ్ నుండి మూడో దశ వలసలు సాగాయి. ఈ మూడో దశ వలసలు రెండోదశ కంటే మరింత ఎక్కువ స్థాయిలో సాగాయి. అందుకొక బలమైన రాజకీయ నేపథ్య కారణం కూడా ఉంది. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో భారతదేశ ప్రత్యక్ష క్రియాశీల అండదండలతో బంగ్లాదేశ్ ఏర్పడింది. అందువల్ల ఆ కాలంలో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య దౌత్య సంబంధాలు పెరిగాయి. బాంగ్లాదేశ్ “విముక్తి” కి సహకరించిన ఇండియా పట్ల బంగ్లాదేశ్ ప్రజల్లో సానుకూల భావన ఏర్పడింది. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కాపలా నామమాత్రమైనది. పైగా నాటి యుద్ధం బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసింది. నిరుద్యోగం, పేదరికాలను తీవ్రం చేసింది. పై అన్ని కారణాల వల్ల రెక్కాడితే తప్ప డొక్కాడని పేద శ్రామిక జనం పొట్టచేత పట్టుకొని సరిహద్దు దాటి ఒకింత స్వేచ్ఛగా ఇండియాలోకి వచ్చారు. ఇదే మూడో దశవలసల ప్రక్రియ! ఈ మూడో దశలో లక్షల సంఖ్యల్లో వలస వచ్చారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. అలా వలస వచ్చే వారిలో ముస్లిములే ఉంటారనే ఒకసాధారణ దురభిప్రాయం ఉంటుంది. అది నిజం కాదు. వారిలో హిందువులతోపాటు ముస్లిములు కూడా ఉన్నారు. (నిజానికి హిందువులే ఎక్కువ శాతం మంది ఉన్నారని మొన్న సెప్టెంబర్ NRC వెల్లడించిన జాబితా నిరూపించింది)

పైన పేర్కొన్న మూడో దశవలసలలో పశ్చిమ బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాల్లోకి సాపేక్షంగా శ్రామిక వలసలు తగ్గాయి. ప్రధానంగా బంగ్లాదేశ్ నుండే సాగాయి. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన సందర్భమిది. అదేమంటే, బంగ్లాదేశ్ నుండి 1971 తర్వాత వలస వచ్చిన శ్రామికజనంలో కొద్దిశాతం మంది నేరుగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లకుండా, తొలుత పశ్చిమ బెంగాల్ కి వలస వచ్చిన వాళ్ళు కూడా వున్నారు. వారిలో కొందరు అక్కడే స్థిరపడగా, మరికొందరు కొంత కాలం తర్వాత మెరుగైనస్థితి వుంటుందనే ఆశతో ఈశాన్య రాష్ట్రాల కు వలస వెళ్లి స్థిర పడ్డారు. ఈ పునర్వలసలలో కూడా మతాతీత ఐక్యత కొనసాగింది. అంటే వీరిలో హిందువులూ, ముస్లిములూ ఉండటం గమనార్హం!

విస్మయం కలిగించే మరో మతాతీత లౌకిక అంశాన్ని కూడా ఇక్కడే పేర్కొనాలి. అస్సాంలోకి లేదా మరో ఈశాన్య ప్రాంతంలోకి ముందుగా ఒక ముస్లిం కుటుంబం వెళ్తే, కొన్నాళ్ళు శ్రమించిన తర్వాత ఉపాధి బాగుందని భావిస్తే, గతంలో బంగ్లాదేశ్ లో తన ఇరుగు పొరుగు హిందూ శ్రామిక కుటుంబానికి కూడా ఉపాధి చూసి, రప్పించేది. అదేవిధంగా ముందుగా ఒక హిందూ శ్రామిక కుటుంబం వలస వెళ్లినా, తనసాటి ముస్లిం శ్రామిక కుటుంబ ఉపాధి కోసం ప్రేమతో అన్వేషించి రప్పించేది. ఈ విధంగా పై వలసలలో కూడా హిందూ, ముస్లిం శ్రామిక ప్రజల మధ్య సుహృద్భావ, సహజీవన సంస్కృతి వర్ధిల్లిన ఘన రాజకీయ నేపద్యం వుండటం గమనార్హం!

1947 లో బ్రిటీష్ పాలకుల నిష్క్రమణ సమయంలోనూ, 1950లో రాజ్యాంగ ఆవిర్భావ సందర్భంలోనూ; 1951లో తొలి NRC ఏర్పాటు సమయంలోనూ; 1955 లో పౌరసత్వ చట్టం రూపొందిన సమయంలోనూ ఈశాన్య రాష్ట్రాల కూ, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికీ మధ్య సంఘర్షణ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. ఈ వైరుధ్యానికి కేవలం రాజ్యాంగపర, న్యాయపర వివాదాంశాలు కారణం కాదు. ప్రాధమికంగా ఈశాన్య రాష్ట్రాల జాతులు ఆదివాసీ తెగ సంస్కృతికి చెందినవి. విస్తృత వలసల కారణంగా తమ భాషలు, సంస్కృతులు, అస్తిత్వం దెబ్బతింటున్నాయనే ఆందోళన ఈశాన్య రాష్ట్రాల స్థానిక ప్రజల్లో క్రమంగా బలపడుతూ వచ్చింది. ఉదా: అస్సాంలోని బారక్ లోయలో బెంగాలీ జాతీయుల వలసలు పెరిగి, స్థానిక జాతీయులు అల్పసంఖ్యాక వర్గీయులుగా మారే పరిస్థితి అసంతృప్తికి గురిచేసింది. అది నివురు కప్పిన నిప్పుగా కొనసాగుతూ వచ్చింది.

అస్సాం లో 1979 లో మంగలదోయ్ లోకసభ నియోజక వర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంలో అసంతృప్తి ఒక్కసారి అగ్నిపర్వతంలా బద్దలైంది. నాటి ఓటర్ల జాబితా స్థానిక ప్రజల్ని అల్పసంఖ్యాకులుగా మారే పరిస్థితికి అద్దం పట్టడమే అందుకు కారణం! అది గౌహుతి విశ్వవిద్యాలయంలో రణన్నినాదమై మోగింది. అదే 1980 లో విదేశీ వలసలకి వ్యతిరేకంగా చరిత్రాత్మక అస్సాం విద్యార్థి ఉద్యమానికి నాంది పలికింది. ఐదేళ్లు సాగిన ఆ ఉద్యమం 1985లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందంతో ముగిసింది.

ఆయా ఒప్పందం ప్రకారం 24-3-1971 కటీఫ్ తేదీ! (ఆ మారునాడే పాకిస్థాన్ తో తూర్పు బెంగాల్ విముక్తి యుద్ధం ప్రారంభం కావడం గమనార్హం) పై కటీఫ్ తేదీన లేదా అంతకు ముందు (on or before march 24th 1971) అస్సాం లో స్థిరపడ్డ వారికి పౌరసత్వం లభిస్తుంది. ఆ మరునాడు లేదా ఆ తర్వాత (on or after march 25th 1971) వలస వచ్చిన వారిని విదేశీయులుగా నిర్ధారించి అస్సాం నుండి బయటకు పంపాలి. స్థూలంగా ఆ నిర్ధారణ ప్రక్రియకు ఉద్దేశించిన చట్టమే NRC!

Comments are closed.

Exit mobile version