మరి కొద్దిరోజుల్లోనే అమెరికాలో ఎన్నికలు జరగనున్న వేళ ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన పర్యటనలో ట్రంప్ ‘ఫేక్ మెలానియా’ను వెంటేసుకుని తిరుగుతున్నారనే వివాదం చుట్టుముట్టడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా మెలానియాను పోలిన మరో మహిళను వెంటబెట్టుకుని ట్రంప్ చక్కర్లు కొడుతున్నారని సోషల్ మీడియా గోల గోల చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.
తన అధికారిక నివాసమైన వైట్ హౌస్ నుంచి నాష్ విల్లేలోని విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన చర్చాగోష్టికి హాజరయ్యేందుకు ట్రంప్ ఈనెల 22వ తేదీన బయలుదేరారు. అయితే ఈ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి తాజా వివాదానికి అసలు కారణం. ఎయిర్ క్రాఫ్ట్ లోకి అడుగిడే ముందు ట్రంప్ తన అభిమానులకు అభివాదం చేస్తుండగా, అదే సమయంలో ఆయన సమీపాన్నే నిల్చుని ఓ మహిళ కనిపించింది. అయితే ఈ మహిళ మెలానియా కాదని, ఆమెను పోలిన మరో మహిళ అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ‘ఫేక్ మెలానియా’గా అభివర్ణిస్తూ హ్యాష్ ట్యాక్ చేస్తున్నారు.
ఈ వివాదంపై ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ట్రంప్ భార్య మెలానియా కోలుకున్నారు. కానీ విపరీతమైన దగ్గు కారణంగా ఆమె అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలక సమావేశానికి హాజరు కాలేకపోతున్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ఫేక్ మెలానియా’ వివాదం ట్రంపును చుట్టుముట్టడం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాక రేపుతోంది.