కన్న బిడ్డలా చూసుకోవలసిన కోడలితోనే వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు ఓ కామపు మామ. అంతేకాదు తన కామపు సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కని, పెంచిన కొడుకును సైతం కడతేర్చిన కసాయి తండ్రి ఉదంతమిది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన దారుణ ఘటనను స్థానిక పోలీసులు మీడియాకు వివరించారు.
అద్దంకి సీఐ రాజేష్, ఎస్ఐ శివన్నారాయణ కథనం ప్రకారం… ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, మరియమ్మలు దంపతులు. వీరికి లక్ష్మయ్య (35) అనే కుమారుడు ఉన్నాడు. అతనికి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతో పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మరియమ్మ దాదాపు 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మయ్య తాగుడుకు బానిసై నిత్యం మత్తులో ఉండేవాడు. ఇదే దశలో మామ కరుణయ్య కామపు కన్ను కోడలు సునీతపై పడింది.
కరుణయ్య, సునీతల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ మధ్య గల వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన కరుణయ్య, సునీతలు లక్ష్మయ్యను హత్య చేసేందుకు పథక రచన చేశారు. ఇందులో భాగంగానే గత ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత గాఢనిద్రలో గల లక్ష్మయ్యపై మామ, కోడలు కలిసి మారణాయుధాలతో దాడి చేసి చంపారు.
ఈ పాశవిక ఘటనను కళ్లారా చూసిన లక్ష్మయ్య పెద్ద కుమారుడు విషయాన్ని బహిర్గతం చేశారు. లక్ష్మయ్యను దారుణంగా హత్య చేసిన మామ, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం కలిగించింది.